ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పెప్సీకోకు సీఈవోగా ఎదిగిన ఇంద్రా నూయీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. అమెరికాలో కాకుండా భారత్‌తో పాటు మరే ఇతర దేశంలో ఉన్నా.. నేను పెప్సీకో సీఈవో అయ్యేదాన్ని కాదని ఆమె అన్నారు.
అమెరికాలో వ్యక్తి ఏ దేశం నుంచి వచ్చాడన్నది కాదు... అతని ప్రతిభ, సామర్థ్యమే విజయాన్ని నిర్ణయిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన ఎదుగుదలకు అమెరికాలోని మెరిట్ ఆధారిత వ్యవస్థే కారణమని చెప్పారు.
అయితే, ఇంద్రా నూయీ వ్యాఖ్యలు వచ్చిన సమయమే అమెరికాలో వలస విధానాలు, విదేశీ ఉద్యోగులు, హెచ్-1బీ వీసాలు, ప్రతిభ ఆధారిత అవకాశాలపై తీవ్ర రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఒకవైపు కఠిన వలస విధానాలకు మద్దతు పెరుగుతుండగా.. మరోవైపు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులే అమెరికా ఆవిష్కరణలకు, కార్పొరేట్ విజయాలకు ప్రధాన బలమని చాలామంది వాదిస్తున్నారు.
ఇంద్రా నూయీ వ్యాఖ్యలను కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఇప్పటి భారత్ పరిస్థితులు గతంతో పోలిస్తే పూర్తిగా మారాయి అంటూ ఆమె అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి.












