యువవ్యాపార వేత్త కేతన్ మర్డర్ కేసు అంశం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. అయితే, పోలీసుల విచారణలో రోజుకో అంశం వెలుగులోకి వస్తున్నది. కేతన్ మరణానికి కారణమైన సియా, చేతన్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు లై డిటెక్టర్ టెస్టుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. అయితే, అందుకు సియా,చేతన్ అంగీకరించలేదు.నిందితుల సమ్మతి లేకుండా పాలిగ్రాఫ్ పరీక్ష చేయకూడదని న్యాయస్థానం పోలీసులను ఆదేశించినట్టు సమాచారం.
కేతన్‌ను కొండ మీద నుంచి తోసేసి హత్య చేసిన కేసులో నిందితురాలు సియా, ప్లాన్ చేసిన ఆమె ప్రియుడు చేతన్‌కు న్యాయస్థానం 14 రోజుల పోలీసు కస్టడీ విధించడంతో..వారిని యరవాడ సెంట్రల్ జైల్‌కు తరలించారు.ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల ఫోన్‌లలో తొలగించిన ఫోన్ కాల్స్, చాట్, ఇతర డేటాను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. అందులో వారు కోడ్ భాషలో మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. వాటిని డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న చేతన్ స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు వెల్లడించారు.












