వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న రావణ్’ మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈసారి చర్చకు కారణం ఆయనపై నమోదైన కేసులు మాత్రమే కాదు... వరుసగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ, విడుదలైన వెంటనే మరో కేసులో మళ్లీ అరెస్టు కావడమే.
మొదట పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పిఠాపురం పోలీసులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు. అక్కడ బెయిల్ లభించగానే కాకినాడ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులోనూ బెయిల్ రావడంతో మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కూడా బెయిల్ రావడంతో అనకాపల్లి పోలీసులు మరో కేసులో అరెస్టు చేశారు. ఇలా వరుస అరెస్టులు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక తాజా కేసు విషయానికి వస్తే..
2025లో గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో జరిగిన గొడవను కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ వీడియోలు పోస్టు చేశారనే ఆరోపణలతో కొత్త కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా ప్రశ్న రావణ్ పోలీసులకు సహకరించలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. తన అరెస్టును కూడా యూట్యూబ్ వీడియోలుగా మార్చి వ్యూస్ సంపాదించుకుంటానని వ్యాఖ్యానించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు, నేడు వీకెండ్ కావడంతో కోర్టులకు సెలవు ఉండటంతో, స్థానిక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది ఆరోపిస్తున్నారు.
గత జూన్ 28న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ నిరసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసుతో ఈ వ్యవహారం మొదలైంది. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. వెంటనే మరో కేసులో అరెస్టు కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, ప్రశ్న రావణ్‌పై రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ వరుస అరెస్టులపై రాజకీయ, న్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ అరెస్ట్, బెయిల్స్ డ్రామా ఒక అంతం లేని లూప్‌లా మారిపోయింది.
కోర్టులో లాయర్లు గట్టిగా వాదించి.. ‘ఇదిగో బెయిల్ వచ్చింది.. ఇక రావణ్ బయటపడ్డాడు’ అని ఆయన అనుచరులు సంబరాలు చేసుకునేలోపే.. పోలీసులు మరో పాత కేసు ఫైల్‌ను బయటకు తీస్తున్నారు. మూడోసారి బెయిల్ రాగానే.. జైలు గేటు దాటకముందే.. నాలుగోసారి కొత్త కేసుతో అరెస్ట్ వారెంట్ సిద్ధంగా ఉంటోంది. దీన్నే లీగల్ టెర్మినాలజీలో రివాల్వింగ్ డోర్ అరెస్ట్ అంటారు. అంటే.. ఒక కేసులో బెయిల్‌పై బయటకు వస్తే.. పోలీస్ శాఖ మరో కేసుతో అరెస్ట్ చేయడం అన్న మాట..












