రాజకీయాలు

బీసీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి!..

రచన: Desk 23 నిమిషాల పఠనం

బీసీ సమస్యలపై చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేసిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి.. బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజును జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానం చేసి, తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల (బీసీలు) సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్ర వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ భేటీలో బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు దుండ్ర కుమారస్వామి తెలిపారు. వినతిపత్రంలో ప్రస్తావించిన అంశాలను సానుకూలంగా పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

వినతిపత్రంలో ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయడం, బీసీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధంగా అమలు చేయడం, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయడం, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడం, బీసీ హాస్టళ్లు, గురుకులాలను ఆధునికీకరించడం, బీసీ యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించడం, సాంప్రదాయ బీసీ వృత్తులకు ప్రత్యేక రక్షణ, ప్రోత్సాహం అందించడం, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడం, అలాగే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో త్రైమాసిక సమీక్షా కమిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక డిమాండ్లను ప్రతిపాదించారు.

తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థికాభివృద్ధిలో బీసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాల సమర్థ అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని దుండ్ర కుమారస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కార్యదర్శి మణికంఠేశ్వర యాదవ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

#telangana#hyderabad#bc#dundra kumara swamy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి