మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిడ్జిల్ ఈ పేరు వినగానే నాకు ప్రజల ప్రేమ, నమ్మకం, బాధ్యత గుర్తుకొస్తాయని అన్నారు. జూలై 2, 2006.. మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహావృక్షమై, మీ ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలిచిందని పేర్కొన్నారు..
సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు కావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఈ జిల్లా గొప్ప నాయకత్వానికి నిలయం. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ నేల బిడ్డ. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి ఈ గడ్డ గర్వకారణం. జైపాల్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు బాటలు వేసిన ద్యాప గోపాల్ రెడ్డి కూడా మిడ్జిల్ బిడ్డే. అందుకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించుకున్నామన్నారు.
జూలై 4, 2006న నేను సాధించిన విజయం.. నా వ్యక్తిగత గెలుపు కాదు. అది మిడ్జిల్ మండల ప్రజల విజయం. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను మీరు ఆశీర్వదించారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయం నా జీవితాన్నే మార్చింది.
నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం కలగకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జడ్‌పీటీసీ ఎన్నికల్లో నాపై పోటీ చేసిన రబ్బానీకి మంచి బాధ్యత ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కోరారు.
ఒకప్పుడు మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. వెనుకబడిన ఈ ప్రాంత ప్రజలు చీకటి నుంచి వెలుగులోకి రావాలని మీరు 2006లో తీసుకున్న నిర్ణయమే... ఈరోజు నన్ను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చింది.
అందుకే మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత. ఈ మండలం జిల్లాకే ఆదర్శంగా నిలవాలి. అందుకే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఈ మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. మిడ్జిల్ ఇక డార్క్ మండలం కాదు... అభివృద్ధికి ప్రతీకగా నిలవాలి.
సంక్షేమంతో పాటు అభివృద్ధి... అభివృద్ధితో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యం. జనగణనతో పాటు కులగణన నిర్వహించి శతాబ్దకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశాం.
నల్లమల నుంచి వచ్చిన నాకు పరిపాలన తెలియదని కొందరు విమర్శించారు. కానీ గ్రామాల్లో పెరిగిన వ్యక్తిగా ప్రజల సమస్యలు నాకు తెలుసు. గ్రామాల సమస్యలు పరిష్కారమైతే రాష్ట్ర సమస్యలూ పరిష్కారమైనట్టే అని తెలిపిన ఆయన.. పదల కష్టాలు తెలిసిన నేను పరిష్కారం చూపలేనా? పాలమూరు బిడ్డ పరిపాలన చేయలేడా? అని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వంలో పేదలకు సన్నబియ్యం అందుతోంది. రైతు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా అందుతోంది. సన్న వడ్లకు బోనస్ ఇచ్చాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు..
పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులు చేసిన వారు ప్రజలకు ఏమిచ్చారు? డబుల్ బెడ్రూం ఇళ్లు అందాయా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? దళితులకు మూడెకరాల భూమి దక్కిందా? కోటి ఎకరాలకు సాగునీరు చేరిందా? అని ప్రశ్నించారు.
ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వారు.. పదేళ్లలో నీళ్లు ఇవ్వలేకపోయారు, నిధులు ఇవ్వలేకపోయారు, ఉద్యోగాలు కల్పించలేకపోయారు. మరి ఎందుకు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారని మండిపడ్డారు.
ప్రజా ప్రభుత్వం పోవాలని అంటున్నారు.. ఎందుకు?.. రేషన్ కార్డులు ఇచ్చినందుకా? సన్నబియ్యం ఇచ్చినందుకా? ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? రైతు భరోసా అందించినందుకా? చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు జమ చేసినందుకా? గంజాయి, డ్రగ్స్ అక్రమాలకు అడ్డుకట్ట వేసినందుకా? అంటూ ధ్వజమెత్తారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోంది. దోపిడీకి, అవినీతికి తావు లేకుండా పాలన కొనసాగిస్తుందన్న రేవంత్ రెడ్డి.. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా.. చివరకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపించడం నా బాధ్యత. మిడ్జిల్ ప్రజలు నాకు ఆత్మబంధువులన్నారు.
ఈ సందర్భంగా రూ.47.08 కోట్లతో మిడ్జిల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 కోట్లతో ఊరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులకు, రూ.20 కోట్లతో పాత మిడ్జిల్ మండల పరిధిలోని నలభై గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అలాగే రూ.17 కోట్ల 8 లక్షల 45 వేల వ్యయంతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. భైరాంపల్లి గ్రామం సమీపంలోని ధుంధుబి వాగుపై రూ.8.74 కోట్లతో, వడియాల్ గ్రామం సమీపంలోని చిన్న వాగుపై రూ.5.91 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. మరోవైపు వస్పుల గ్రామం సమీపంలోని వస్పుల కత్వా పునరుద్ధరణకు రూ.2.42 కోట్లను కేటాయించినట్టు తెలిపారు.












