రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న వేళ, రైతుల కోసం ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను శనివారం విడుదల చేసింది.
ఈ విడతలో ఆరు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేసింది. ఒక్క రోజులోనే సుమారు లక్షా 69 వేల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,135 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయడం విశేషం.
ఇప్పటికే జూన్ 30 నుంచి ప్రభుత్వం దశలవారీగా రైతు భరోసా నిధులను పారదర్శకంగా విడుదల చేస్తోంది. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సాయం అందించగా.. తర్వాత వరుసగా మూడు, నాలుగు ఎకరాల రైతులకు నిధులు జమ చేసింది.
శుక్రవారం ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. ఇప్పుడు ఆరు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులు కూడా ఈ జాబితాలో చేరారు. వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి నేరుగా ఖాతాల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.












