ఆలయ కానుకలపై అక్రమాల ఆరోపణలు
బీకేటీసీ ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు నోటీసులు
సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ తరహానే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బద్రీనాథ్ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం తీవ్రస్థాయిలో చర్చసాగుతోంది. ఈ మేరకు బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) స్పందించి అధికారిక విచారణకు ఆదేశించింది.
ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది, అసలు వాస్తవాలను వెలికితీసేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసి, వివరణ కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు. అయితే దర్యాప్తు పూర్తికాకముందే ఒక ముగింపునకు రావద్దని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలను భక్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
విచారణ నివేదిక అందిన తర్వాతే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని, దాని ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని బీకేటీసీ పేర్కొంది. ఇదే సమయంలో, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి (PA) అంటూ సాగుతున్న ప్రచారాన్ని హేమంత్ ద్వివేది తీవ్రంగా ఖండించారు. తనకు ఎలాంటి వ్యక్తిగత కార్యదర్శి లేరని స్పష్టం చేశారు. సదరు వ్యక్తి ఆలయ కమిటీలో ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని తేల్చి చెప్పారు. గత ముగ్గురు అధ్యక్షుల హయాంలోనూ ఆ ఉద్యోగి ఇదే విధుల్లో కొనసాగాడని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.












