టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబ ఆస్తి వేలం వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు తన స్థిరాస్తిని వేలం వేశారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేయడం చట్టబద్ధమేనంటూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
"బ్యాంకు అధికారులు లోపాయికారీ ఒప్పందాలతో మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువ రేటుకే నా ఆస్తిని విక్రయించి అన్యాయం చేశారు. ఈ అక్రమాలపై 2022లోనే నేను న్యాయపోరాటం ప్రారంభించాను. అప్పట్లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ) నాకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. కానీ, తాజాగా హైకోర్టులో వ్యతిరేక నిర్ణయం వచ్చింది. అయినప్పటికీ న్యాయవ్యవస్థపై నమ్మకంతో, నా హక్కుల కోసం త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను." అని ఆయన స్పష్టం చేశారు.
అసలు ఏమైందంటే..
రుణాల వసూళ్ల ప్రక్రియలో భాగంగా బండ్ల గణేశ్ కుటుంబానికి చెందిన జూబ్లీహిల్స్ ఆస్తిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వేలం వేసింది. అయితే ఈ వేలం ప్రక్రియ చెల్లదని, దాన్ని రద్దు చేసి వేలం ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి యజమానులకే ఇవ్వాలని గతంలో డీఆర్‌టీ (ట్రైబ్యునల్) బ్యాంకును ఆదేశించింది. ట్రైబ్యునల్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. డీఆర్‌టీ తీర్పును కొట్టేస్తూ, బ్యాంక్ జరిపిన ఆస్తి వేలం పూర్తిగా చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుపైనే బండ్ల గణేశ్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.












