ఓయూ పరిధిలో చదివే విద్యార్థులకు వర్సిటీ అధికారులు షాక్ ఇచ్చారు. వారు తీసుకున్న నిర్ణయం విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపనుంది.2026-27 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీ అందించే వివిధ రకాల అకడమిక్ సేవల చార్జీలను భారీగా పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సేవలను బట్టి ఈ ఫీజుల పెంపు కనీసం 20 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు ఉంటుందని పేర్కొనడం గమనార్హం. కొత్త చార్జీలు ప్రస్తుత అకడమిక్ నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.
వర్సిటీ తాజా నిర్ణయం వలన విద్యార్థులు ఉపయోగించుకునే ఈక్వివలెన్సీ, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు, మైగ్రేషన్, కాండోనేషన్ వంటి సేవలన్నింటికీ ఇకపై అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా హాజరు శాతం తగ్గినప్పుడు విద్యార్థులు చెల్లించే యూజీ , పీజీ కాండోనేషన్ ఫీజును గతంలో ఉన్న రూ.500 ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.1,000కి పెంచారు. దీనిపై అటు విద్యార్థులు,ఇటు విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వర్సిటీపై పడుతున్న అదనపు నిర్వహణ వ్యయం వల్లే ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని అధికారులు చెబుతుండగా.. సాధారణ,మధ్యతరగతి విద్యార్థులపై భారం పడనుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












