క్రైమ్

తిరుమలలో నకిలీ ఆధార్‌ కార్డుల దందా!

రచన: Desk 35 నిమిషాల పఠనం

కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులను నట్టేట ముంచుతున్న ఓ అంతర్రాష్ట్ర దళారుల ముఠా గుట్టు రట్టయింది. నకిలీ ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వసతి గదులను అక్రమంగా బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన సమాచారంతో తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

  • 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, కీలకమైన డిజిటల్ ఆధారాలు స్వాధీనం

  • నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసిన తిరుమల 2టౌన్ పోలీసులు

కలియుగ వైకుంఠం తిరుమలలో సామాన్య భక్తులను నట్టేట ముంచుతున్న ఓ అంతర్రాష్ట్ర దళారుల ముఠా గుట్టు రట్టయింది. నకిలీ ఆధార్ కార్డులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వసతి గదులను అక్రమంగా బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన సమాచారంతో తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జూలై 2వ తేదీన తిరుమల సీఆర్‌వో కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. పోలీసుల శైలిలో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు విభిన్న మొబైల్ యాప్‌లను ఉపయోగించి నకిలీ ఆధార్ కార్డులను సృష్టిస్తున్నట్లు తేలింది. వాటి ద్వారా టీటీడీ గదులను పొంది, ఆపై గదులు దొరకక ఇబ్బంది పడే అమాయక భక్తులకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధిక ధరలకు అమ్ముతూ అక్రమ లాభాలు ఆర్జిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు మరొక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణకు చెందిన ఎం.వేణుగోపాల్, టి.ఈశ్వర్, ఏపీకి చెందిన దొంత రవీంద్రబాబు, యూపీకి చెందిన సంతోష్ కుమార్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, కీలకమైన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గత కొంతకాలంగా టీటీడీని, భక్తులను మోసం చేస్తున్న ఈ పెద్ద ముఠాను చాకచక్యంగా పట్టుకున్న తిరుమల 2 టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

శ్రీవారి భక్తులకు పోలీసుల అలర్ట్

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలో వసతి గదులను కేవలం అధికారిక కౌంటర్లు లేదా టీటీడీ అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారానే పొందాలని పోలీసులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే తిరుమల పోలీసులు లేదా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. భక్తులను మోసం చేసే ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

#TirumalaCrime#FakeAadhaarCardScam#TTDRoomBookingFraud#TirupatiPolice#InterstateGangArrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి