తెలంగాణ

20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

రచన: Desk 35 నిమిషాల పఠనం

ప్రజాప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి విజయవంతంగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి శనివారం(నేడు) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.

  • నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటన!

  • రాజకీయ జన్మనిచ్చిన గడ్డపై సీఎం కృతజ్ఞత సభ

ప్రజాప్రతినిధిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి విజయవంతంగా 20 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి శనివారం(నేడు) ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తనకు జడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ గడ్డపై ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఈ పర్యటనను వేదికగా చేసుకోనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, ఆనాటి మిత్రులు, పెద్దలతో సీఎం ఆత్మీయంగా గడపనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నేటి పర్యటన పూర్తి షెడ్యూల్

మధ్యాహ్నం 12.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1.00 గంటలకు ఆలయ ఆవరణలోనే తన ఆత్మీయులు, నాటి రాజకీయ పెద్దలతో కలిసి సీఎం లంచ్ చేస్తారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించనున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు ఊరుకొండపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా మిడ్జిల్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చేరుకుంటారు. మిడ్జిల్‌లోని వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్, మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి (గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి) విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.

మధ్యాహ్నం 3.00 గంటలకు మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మిడ్జిల్ మండలంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం రాకతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో, స్థానిక ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

కాగా, తన 20ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. వివిధ దశల్లో ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన పలు ఫొటోలను పంచుకున్నారు.

‘‘లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలను కూర్చి చెప్పినా… తరగని మధుర జ్ఞాపకం… ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై… నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా… అన్నింటికీ మించి రేవంతన్నగా… మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

#cmrevanthreddy#telanganacm#congressgovt#telanganagovt#Mahabubnagardist#cmtour#cmmahabubnagartour#revanth20yearsexperience#telanganapolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

ఫోటోలు

తర్వాత చదవండి