వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో కూడా ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












