తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్, డీఎంకేల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి ఇటీవల తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరుచెందూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
జూన్ 20వ తేదీన తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో అనితా రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ హావభావాలపై విమర్శలు గుప్పించారు. “రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయానని విజయ్ బాధపడుతున్నారని, అసెంబ్లీలో ఆయన ముఖం చూస్తే ఆ విషయమే స్పష్టమవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, “సినిమా ఇండస్ట్రీలో నటి త్రిషతో ఎంతో సంతోషంగా గడిపిన రోజులను బహుశా ఆయన గుర్తుచేసుకుంటున్నారేమో” అంటూ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించి వివాదానికి తెరలేపారు.
ఈ వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని టీవీకే పట్టణ కార్యదర్శి సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అనితా రాధాకృష్ణన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ధర్మాసనం ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. సీఎం విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకేకు చెందిన ఒక ముఖ్య నేత అరెస్ట్ కావడం తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.












