కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న జీరాంజీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది..మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదిక ప్రకారం... ఈ పథకం అమలైతే తెలంగాణ ఖజానాపై ఏకంగా రూ.1,900 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని వెల్లడించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీరాంజీ కింద రూ.3,825 కోట్లు కేటాయించగా.. రాష్ట్రం తన వాటాగా రూ.2,550 కోట్లు భరించాల్సి వస్తుంది. అంతేకాదు... పరిపాలన వ్యయంతో పాటు కేంద్రస్థాయి సిబ్బంది వేతనాల్లో మూడో వంతు కూడా రాష్ట్రానిదే అవుతుందని నివేదిక పేర్కొంది.
అయితే అసలు వివాదం ఇక్కడే మొదలవుతోంది. ఈ పథకంలో ఏ పనులు చేయాలి... ఎంత నిధులు ఇవ్వాలి... అన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు స్వీకరించే అవకాశం లేకపోవడం వల్ల..తెలంగాణ వంటి రాష్ట్రాలకు వివక్ష జరిగే ప్రమాదం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది.
మరోవైపు రాష్ట్రాన్ని సంప్రదించకుండా పనులు ఖరారు చేసే, నిధులు కేటాయించే విధానం వివక్షకు దారితీసే అవకాశముందని, 60 రోజుల విరామం తదితర నిబంధనలు.. పేదలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది.
గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గడమే కాకుండా.. కూలీ రేట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ మండలిని ఏర్పాటు చేయాలని.. రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఉపసంఘం సిఫార్సు చేసింది.
అంతేకాదు.. రాష్ట్రంతో సరైన సంప్రదింపులు లేకుండానే అదనపు ఆర్థిక భారం మోపుతున్నందుకు తెలంగాణ మంత్రిమండలి అధికారికంగా నిరసన నమోదు చేసి... కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించింది.
ఇక చట్టపరంగానూ ఈ అంశాన్ని సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీరాంజీ చట్టం రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌కు, సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ... సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది.
మరి ఈ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? తెలంగాణ వాదనకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? రానున్న రోజుల్లో ఈ అంశం రాజకీయంగానే కాదు... చట్టపరంగానూ కీలక చర్చకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వెళ్లాడవుతున్నాయి.












