తెలంగాణ

Telangana: పెద్ది మరణం పై తెలంగాణ రాజకీయాల్లో దుమారం!..

రచన: Venu6 నిమిషాల పఠనం

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత నెల 26న హనుమకొండలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియలు కూడా ముగిసాయి.. అయినా ఆయన మరణం చుట్టూ రాజకీయ దుమారం మాత్రం ఆగడం లేదు.

తెలంగాణ రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ మరణం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గత నెల 26న హనుమకొండలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం సికింద్రాబాద్‌లోని ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంత్యక్రియలు కూడా ముగిసాయి.. అయినా ఆయన మరణం చుట్టూ రాజకీయ దుమారం మాత్రం ఆగడం లేదు.

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు గుప్పిస్తోంది. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... పెద్ది సుదర్శన్ రెడ్డిని రాజకీయంగా వేధించారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి మానసికంగా ఒత్తిడి తెచ్చారని, ఈ విషయాన్ని పెద్ది స్వయంగా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు.

అదీగాక విద్యాశాఖలో జరిగిన అవినీతి వ్యవహారంపై పెద్ది సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని... ఆయన మరణించిన మరుసటి రోజే ఆ కేసులో సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుల ప్రమేయంతో నర్సంపేట భూముల వ్యవహారంలో కేసులు నమోదు చేసి పెద్ది అనుచరులను వేధించారని ఆయన ఆరోపించారు.

రూ.1,100 కోట్ల సివిల్ సప్లైస్ వ్యవహారం, విద్యాశాఖలో బంకర్ బెడ్ల కొనుగోలు అంశాలపై పెద్ది సుప్రీంకోర్టు, ఈడీలను ఆశ్రయించడంతో ఆయనను టార్గెట్ చేశారని ఆరోపించాడు. అలాగే వట్టి నాగులపల్లి భూముల అంశంలో కూడా తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదురైందని తెలిపారు. మరోవైపు ఈ ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తోంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నప్పుడు పట్టించుకోకుండా, ఇప్పుడు ఆయన మరణాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడమే బీఆర్ఎస్ అసలు లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని... ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత రాజ్యసభ లేదా, ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఇక పెద్ది అనారోగ్యానికి గురైన సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిందని... అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి గౌరవించిందని, ఉద్యమకారులను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకుని... అధికారంలో ఉన్నప్పుడు పదవులన్నీ ఒకే కుటుంబానికి పరిమితం చేయడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతిగా మంత్రి పొంగులేటి మండిపడ్డారు..

మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట అమరవీరుల స్థూపం వద్ద... భర్త పార్థివదేహం పక్కనే నిలబడి.. నా భర్తను మీరే పొట్టన పెట్టుకున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పు చూపిస్తూ చేసిన ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ... ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అదే ఇప్పుడు రాజకీయాల్లో కొత్త సస్పెన్స్‌కు కారణమైంది.

ఒకవైపు రాజకీయ వేధింపుల వల్లే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరోవైపు సానుభూతి కోసం బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో ఈ అంశం కేవలం ఒక నాయకుడి మరణం చుట్టూ తిరిగే వివాదంగా కాకుండా... అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పొరుగా మారింది.

#Telangana#politics#Peddi#death causes#BRS#Congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి