దేశంలో మద్యం కేవలం ఒక పానీయం మాత్రమే కాదు... ప్రభుత్వాలకు భారీ ఆదాయ వనరు కూడా. ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం రాష్ట్ర ఖజానాల్లోకి చేరుతోంది. అందుకే మద్యం విక్రయాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక మద్యం లేనిదే కొందరికి పొద్దు గడవదు.. కొన్ని రాష్ట్రాలలో అయితే ఏ ఫంక్షన్ చేసిన ముందుగా మందు ఉండవలసిందే..
అయితే దీనిని ఆసరాగా తీసుకుని కొందరు కల్తీ మద్యానికి తెరలేపారు..ఇప్పటికే మార్కెట్‌లో కల్తీ మద్యం అందుబాటులో ఉండగా.. ఇది సేవించిన వారి ఆరోగ్యాలు ఆస్పత్రిపాలవుతున్నాయి.. ఇలా వినియోగదారులను తప్పుదారి పట్టించేలా మద్యం తయారీలో కృత్రిమ ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలతో ప్రముఖ మద్యం బ్రాండ్ల అమ్మకాలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ కఠిన చర్యలు చేపట్టింది.
మందుబాబుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ మద్యం తయారీ సంస్థలైన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్‌బ్రూ బేవరేజెస్‌కు చెందిన కొన్ని మద్యం బ్రాండ్ల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌లో తయారవుతున్న యునైటెడ్ స్పిరిట్స్ బ్రాండ్లైన యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీతో పాటు ఇన్‌బ్రూ బేవరేజెస్‌కు చెందిన బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ XXX రమ్ విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
సాధారణంగా విస్కీ, రమ్‌ల తయారీలో ఉపయోగించే ముడిసరుకుల ద్వారానే వాటికి సహజమైన రుచి, సువాసన రావాల్సి ఉంటుంది. అయితే, ఈ కంపెనీలు సహజ ప్రక్రియకు బదులుగా కృత్రిమ ఫ్లేవర్లను కలిపి విక్రయిస్తున్నట్లు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తనిఖీల్లో తేలింది. ఇలా చేయడం వినియోగదారులను మోసం చేయడమేనని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్యం తయారీ సంస్థలు కోర్టుకు వెళ్లగా.. అధికారులు వారికి కొంత ఊరట కల్పించారు.
అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న స్టాక్‌కు ప్రభుత్వం కొన్ని షరతులతో వెసులుబాటు కల్పించింది. బాటిళ్లను వెంటనే విక్రయించేందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రతి బాటిల్ ముందు భాగంలో కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగించాం అనే విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా కొత్త లేబుల్ తప్పనిసరిగా అతికించాలని ఆదేశించింది. ఈ సవరించిన లేబుళ్లు అమర్చిన తర్వాత మాత్రమే ఆయా మద్యం బాటిళ్లను మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు..












