భారత్‌లో చోరీలు చేసి.. దొంగిలించిన బంగారం, వెండి, విలువైన వస్తువులను బంగ్లాదేశ్‌కు తరలించి అక్కడ విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నేడు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంతో చాకచక్యంగా నిఘా పెట్టిన పోలీసులు ఈ ముఠా కార్యకలాపాలను ఛేదించి, భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఆఖిల్ మహజన్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారని తెలిపారు. వీరు కేవలం దొంగతనాల కోసమే భారత్‌కు వచ్చి, ఇక్కడ బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను దొంగిలించి బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.
కాగా ఈ ముఠాలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పలు చోరీలకు పాల్పడిన ఈ గ్యాంగ్, ఇటీవల తెలంగాణలో కూడా వరుస దొంగతనాలు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రెండు చోరీల వెనుక కూడా ఇదే ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన నిందితులు రాజస్థాన్‌లోని జైపూర్‌లో నకిలీ ఆధార్ కార్డులు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఆ నకిలీ గుర్తింపు పత్రాల ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోందని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.












