కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న పేద, మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దగా పడేలా చేస్తున్నారు కొందరు ఖిలాడీ మోసగాళ్లు. తమ చెమట రక్తాన్ని ఓడ్చి సంపాదించిన కష్టార్జితాన్ని నమ్మి అప్పగిస్తే.. చివరకు కోర్టులు, చట్టాలలోని లొసుగులను వాడుకుంటూ ఎదురు బాధితులకే లీగల్ నోటీసులు, దివాళా (IP) నోటీసులు పంపిస్తూ పక్కా ప్లాన్‌తో నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కడప జిల్లా పులివెందులలో వెలుగు చూసింది.
ఉపాధ్యాయ వృత్తిని నమ్మి కోట్లాది రూపాయలు అప్పగించిన బాధితులకు కోలుకోలేని షాక్ తగిలింది. చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరుతో దాదాపు 70మంది వద్ద ఏకంగా రూ.7 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు చివరికి బోర్డు తిప్పేసి చావుదెబ్బ కొట్టాడు. పులివెందుల ముద్దనూరు రోడ్డులో నివాసముండే శివకాశి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు స్థానికంగా చిట్టీల వ్యాపారంతో పాటు అధిక వడ్డీలకు ఆశచూపి ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు.
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవం, అతని మృదుస్వభావం, మంచితనాన్ని చూసి స్థానికులు, ఆయన దగ్గర పనిచేసిన సహచరులు నమ్మి పెద్ద మొత్తంలో పొదుపు సొమ్మును ఆయన వద్ద చిట్టీల రూపంలో డిపాజిట్ చేశారు. ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో హఠాత్తుగా ఊహించని మలుపు తిరిగింది. బాధితుల నుంచి సేకరించిన కోట్లాది రూపాయలతో శివకాశి ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే పరారయ్యాడు. అంతేకాకుండా, తాను ఎవరి వద్ద నుంచైతే డబ్బులు తీసుకున్నాడో, వారందరికీ లాయర్ల ద్వారా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (IP-దివాళా) నోటీసులు పంపి షాక్ ఇచ్చాడు.
నమ్మిన ఉపాధ్యాయుడే తమను నట్టేట ముంచాడని తెలుసుకున్న బాధితులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తీవ్ర మానసిక ఆందోళనకు గురైన బాధితులు వెంటనే పులివెందుల పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు పరారీలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల వివరాలను ఆరా తీస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు.












