National

India: ముంచుకొస్తున్న ముప్పు.. ఆర్గాన్ సంక్షోభం దిశగా భారత్!..

రచన: Venu7 నిమిషాల పఠనం

2021 గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్షా 25 వేల మందికి కిడ్నీ మార్పిడి అవసరం ఉంటోంది. కానీ వారిలో కేవలం 9 వేల మందికి మాత్రమే కిడ్నీ దొరుకుతోంది. అలాగే లక్షా 84 వేల మందికి పైగా లివర్ మార్పిడి అవసరం ఉండగా.. మూడు వేల మందికి కూడా ఆ అవకాశం దక్కడం లేదు. అలాగే గుండె మార్పిడి విషయంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

దేశంలో అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో అవసరానికి అవయవాలు దొరకక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 2040 నాటికి దేశం తీవ్రమైన అవయవాల కొరతను ఎదుర్కొంటుందని ప్రపంచ ప్రఖ్యాత వైద్య జర్నల్ ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏసియా హెచ్చరించింది.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్-2021 డేటా, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ట్రాన్స్‌ప్లాంట్ సంస్థల వివరాల ఆధారంగా వైద్య నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2021 గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు లక్షా 25 వేల మందికి కిడ్నీ మార్పిడి అవసరం ఉంటోంది. కానీ వారిలో కేవలం 9 వేల మందికి మాత్రమే కిడ్నీ దొరుకుతోంది.

అలాగే లక్షా 84 వేల మందికి పైగా లివర్ మార్పిడి అవసరం ఉండగా.. మూడు వేల మందికి కూడా ఆ అవకాశం దక్కడం లేదు. అలాగే గుండె మార్పిడి విషయంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 84 వేల మందికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉంటే.. కేవలం 151 మందికి మాత్రమే గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. అలాగే 11 వేల మందికి పైగా ఊపిరితిత్తుల మార్పిడి అవసరం ఉండగా.. కేవలం 133 మందికి మాత్రమే లంగ్స్ అందాయి.

అంటే దేశంలో ప్రతి సంవత్సరం 90 శాతానికి పైగా రోగులు అవసరమైన అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇక మన దేశంలో కిడ్నీల కంటే లివర్ మార్పిడి అవసరం ఎక్కువగా ఉండటం కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్, మద్యం వినియోగం వంటి కారణాలతో లివర్ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే అవయవ దానంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఈ అధ్యయనం ప్రశంసించింది. రాష్ట్రంలో అమలవుతున్న జీవన్‌దాన్ కార్యక్రమాన్ని రోల్ మోడల్‌గా పేర్కొంది. ప్రభుత్వ సహకారం, సరైన వ్యవస్థ, ప్రజల్లో అవగాహన ఉంటే అవయవ దానాన్ని గణనీయంగా పెంచవచ్చని తెలిపింది. నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ 2024 నివేదిక ప్రకారం.. దేశంలో జరిగే మొత్తం అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో 80 నుంచి 96 శాతం వరకు తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి.

దేశ జనాభాలో ఈ రాష్ట్రాల వాటా 30 శాతం కూడా లేకపోయినా అత్యధిక ట్రాన్స్‌ప్లాంట్లు ఇక్కడే నమోదవుతున్నాయి. మరోవైపు విదేశాల్లో ఎక్కువగా బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి అవయవాలు సేకరిస్తుంటే.. మన దేశంలో మాత్రం 80 శాతానికి పైగా అవయవాలు లైవ్ డోనర్స్ నుంచే వస్తున్నాయి. బ్రెయిన్‌డెడ్ రోగులను గుర్తించే వ్యవస్థ బలోపేతం కాకపోవడం, ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అధ్యయనం తెలిపింది.

అవయవాల కేటాయింపులో మహిళలు కూడా వెనుకబడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. అవసరం ఉన్నప్పటికీ మహిళలకు పురుషులతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే కిడ్నీ, లివర్, గుండె మార్పిడి జరుగుతోందని పేర్కొన్నారు. ఇక 2040 నాటికి దేశంలో కిడ్నీలు, లివర్లు, గుండెలు, ఊపిరితిత్తుల అవసరం మరింత పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. ప్రభుత్వాలు ఇప్పటి నుంచే వైద్య సదుపాయాలను విస్తరించినా... రాబోయే అవసరాన్ని పూర్తిగా తీర్చడం కష్టమేనని హెచ్చరించింది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌ప్లాంట్ సేవలను పెంచడం, ఐసీయూలను బలోపేతం చేయడం, బ్రెయిన్‌డెడ్ కేసులను వేగంగా గుర్తించడం, ప్రజల్లో అవయవ దానంపై అవగాహన పెంచడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే కిడ్నీ కోసం ఐదు వేల మందికి పైగా, లివర్ కోసం నాలుగు వేల మందికి పైగా రోగులు ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్న వైద్య నిపుణులు.. ప్రజల్లో అవయవ దానంపై చైతన్యం పెరిగితేనే ఈ కొరతను కొంతవరకైనా తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు దేశంలో జనాభాతో పాటు.. వారి ఆయుష్హు పెరగడం, మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి నాన్- కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అవుతుండటంతో 2040 నాటికి అవయవాల డిమాండ్ పెరుగుతుందని ఈ రీసెర్చ్ స్పష్టం చేసింది. అలాగే దేశ వ్యాప్తంగా 2040 నాటికి ఏటా 1.43 లక్షల కిడ్నీలు, 2.10 లక్షల లివర్లు ,95 వేల హార్ట్స్, 12 వేల లంగ్స్ ఉంటేనే రోగుల ప్రాణాలు నిలిచే పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేసింది.

ప్రభుత్వాలు సంస్కరణలు చేపట్టి, ఏటా 8 నుంచి 10 శాతం మేర వైద్య సౌకర్యాలు పెంచినా.. 2040 నాటికి కిడ్నీల అవసరాల్లో 32.6 శాతం మాత్రమే తీర్చగలమని.. లివర్, గుండె, లంగ్స్ అవసరాల్లో కనీసం 7 శాతం కూడా తీర్చలేమని నివేదిక హెచ్చరించింది.

#National News#India#organ crisis#Health#Brain-dead
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి