విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దక్షిణ కోస్తా రైల్వే అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రూట్ మ్యాప్, టైమ్‌టేబుల్స్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
విశాఖపట్నం నుంచి బయలుదేరి విజయవాడ, తిరుపతి, జోలార్‌పేట మీదుగా బెంగళూరు చేరుకునేలా వందే భారత్ స్లీపర్ రైలు సిద్ధమైందని, దీనికి సంబంధించిన వేళాపట్టిక కూడా ఖరారైందంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు విపరీతంగా ప్రచారమయ్యాయి. రాత్రిపూట ప్రయాణించేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారన్న వార్తలతో ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) అధికారులు స్పష్టతనిచ్చారు.
ఈ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు రైల్వే శాఖగానీ, సౌత్ కోస్ట్ రైల్వేగానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదా నోటిఫికేషన్ విడుదల చేయలేదని సీనియర్ అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న డాక్యుమెంట్లు, టైమ్‌టేబుల్స్ కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు. రైలు సర్వీసులకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ లేదా జోనల్ రైల్వేల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు.
వాస్తవానికి విశాఖపట్నం నుంచి అదనపు రైలు సర్వీసులను నడిపేందుకు, అనువైన రూట్లను గుర్తించేందుకు చేసిన ఒక అంతర్గత సర్వే/ప్రతిపాదన పత్రం మాత్రమే బయటకు వచ్చిందని, అది ఇంకా పరిశీలన దశలోనే ఉందని అధికారులు వెల్లడించారు. రైల్వే బోర్డు ఆమోదం లభిస్తేనే ఏ రైలైనా పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల కోసం భారతీయ రైల్వే వేగవంతంగా సిద్ధం చేస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే మార్గాల్లో ప్రవేశపెడతారనే దానిపై రైల్వే బోర్డు నుంచి ఇంకా అధికారిక జాబితా రావాల్సి ఉంది.












