ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ ప్రభావం భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. దశాబ్ద కాలంగా హెచ్‌సీఎల్‌టెక్‌తో కొనసాగుతున్న భారీ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్‌లో గూగుల్ సంస్థ రూ. 400 కోట్లకు పైగా (5 కోట్ల డాలర్లు) కోత విధిస్తూ నిర్ణయం తీసుకోవడం ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ లభ్యత పెరగడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ సాంప్రదాయ ఐటీ అవుట్‌సోర్సింగ్ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ భారతీయ ఐటీ దిగ్గజం 'హెచ్‌సీఎల్‌టెక్'తో ఉన్న సుదీర్ఘ అవుట్‌సోర్సింగ్ ఒప్పందాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయకంగా భారీ మానవ వనరుల ఆధారంగా నడిచే పనులను ఏఐ టూల్స్ వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తుండటంతో గూగుల్ తమ బడ్జెట్‌లో కోత విధించింది. ఈ మార్పు భారత ఐటీ రంగానికి రాబోయే కాలంలో ఎదురయ్యే సవాళ్లకు స్పష్టమైన సూచికగా నిలుస్తోంది.
గూగుల్ తన అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్ సేవల నిమిత్తం హెచ్‌సీఎల్‌టెక్‌తో గత దశాబ్ద కాలంగా కుదుర్చుకున్న ఒప్పందంలో ఏటా సుమారు 5 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 418 కోట్లు) మేర కోత విధించింది. గతంలో ఏడాదికి దాదాపు 20 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఈ కాంట్రాక్ట్ పరిధిని కుదించడంతో హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక ఆదాయంలో కొంత మేర తగ్గుదల నమోదు కానుంది. అయితే, ఇది కంపెనీ మొత్తం వార్షిక ఆదాయంలో కేవలం 0.3 శాతం మాత్రమే కావడం వల్ల ప్రాథమికంగా ఆర్థికంగా పెద్ద నష్టం లేనప్పటికీ, భవిష్యత్తులో మిగిలిన క్లయింట్లు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కాగా, ఈ ఒప్పందం కుదింపు వల్ల తక్షణమే భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) ఉండకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. గూగుల్ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం పనిచేస్తున్న దాదాపు 1,000 మంది హెచ్‌సీఎల్‌టెక్ ఇంజినీర్లను కంపెనీలోని ఇతర ప్రాజెక్టులలోకి పునర్విభజించనున్నారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి ఆధునిక సాంకేతికతలపై దృష్టి సారించే నూతన విభాగాలు, ప్రాజెక్టుల్లోకి ఈ సిబ్బందిని రీ-డిస్ట్రిబ్యూట్ (Re-allocate) చేయనున్నట్లు సమాచారం.
సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ, వారిని ఆటోమేషన్ లేని ప్రాజెక్టుల్లోకి మార్చడం ఐటీ కంపెనీలకు తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు కేవలం ఉద్యోగుల సంఖ్య (Headcount) ఆధారంగా లభించిన ప్రాజెక్టుల స్థానంలో ఇప్పుడు ఏఐ-ఆధారిత పనితీరు, అవుట్‌పుట్ ఆధారిత కాంట్రాక్టులు ముందంజ వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో సాంప్రదాయ ఐటీ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాలకు గిరాకీ తగ్గి.. ఏఐ, ఆటోమేషన్ నైపుణ్యాలు ఉన్నవారికే మార్కెట్లో ప్రాధాన్యం దక్కుతుందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది












