రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు మరింత పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు కదం తొక్కారు. ఇప్పటికే నోటిఫికేషన్లు చాలా ఆలస్యం అయ్యాయని, తమ ఏజ్ దాటిపోతుందని అందుకే మొత్తం 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు.
ప్రస్తుతం విడుదల చేసిన 7,437 పోలీసు ఉద్యోగ పోస్టులతో పాటు మరో 19 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ కోరుతూ రోడ్డు మీద బైఠాయించారు.నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2084144420316983558?s=20
దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్సై పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని నిరుద్యోగులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ప్రధాన రహదారిపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి తోడు దరఖాస్తు రుసుమును సైతం వెంటనే తగ్గించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగుల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా, ఉన్నట్టుండి రోడ్డు మీదకు నిరుద్యోగులు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు నిరుద్యోగులను అక్కడి నుంచి తరలించినట్టు సమాచారం.












