కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే చుట్టూ ప్రస్తుతం దేశరాజకీయం తిరుగుతోంది. ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగించడానికి పెద్దఎత్తున విదేశీ ఫండ్స్ వచ్చాయని దుమారం రేగుతోంది. దీనికి తోడు అభిజీత్ అమెరికాలో చదువుకునేందుకు ఎలా వెళ్లాడు? డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు? అని సైతం వివాదం చెలరేగిన సమయంలో ఓ ఆర్టీఐ యాక్టివిస్ట్ అతని చదువుకు పెట్టిన డబ్బులు ఎంత? ఎక్కడి నుంచి వచ్చాయ్ అన్నకోణంలో విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే స్పందించారు. అమెరికా ఉన్నత చదువులకు నిధులు ఎవరిచ్చారు? అనే వివాదంపై తాజాగా కౌంటర్ ఇచ్చాడు. ఓ జాతీయా మీడియాతో దీప్కే మాట్లాడుతూ.. తాను బోస్టన్ వర్సిటీ నుంచి పొందిన స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేశానని వెల్లడించారు. తన తండ్రి ఆస్తులు, విద్యార్హత ఖర్చులపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కార్యకర్త అమిత్ తివారి ఆరోపణలు చేసినందున దీప్కే క్లారిటీ ఇచ్చారు.
బోస్టన్ వర్సిటీ నుంచి తనకు సెమిస్టర్‌కు 12,500 డాలర్ల చొప్పున 3 సెమిస్టర్లకు గానూ మొత్తం 37,500 డాలర్ల డీన్స్ స్కాలర్‌షిప్ వచ్చిందని తెలిపారు. మిగిలిన ఖర్చుల కోసం బ్యాంక్‌లో ఎడ్యుకేషన్ రుణం తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆ అప్పును చెల్లిస్తున్నానని స్పష్టంచేశారు. తనకు వచ్చిన స్కాలర్‌షిప్ పత్రాలను కూడా అభిజిత్ మీడియాకు చూపించాడు.
కాగా, అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావ్ దీప్కే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేశారని, నెలకు రూ.60 వేల నుంచి 65 వేల జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగి, తన కొడుకును అమెరికా పంపి అంత ఖరీదైన చదువు ఎలా చెప్పించగలరని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారి ప్రశ్నించారు. వారి ఆదాయవ్యయాలపై విచారణ జరిపించాలని మహాసర్కార్‌కు ఫిర్యాదు చేశారు.












