రాష్ట్రంలో ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఫేమస్ అయిన ప్రభుత్వ స్కూల్ టీచర్ భూక్యా గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె ఖమ్మంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గతంలో ఆమె ఓ ప్రైవేట్ స్కూల్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్ చేయడం,అది కాస్త వైరల్ అవ్వడంతో వచ్చిన విమర్శలపై డీఈవో ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే టీచర్ గౌతమి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.అందుకు గల కారణాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రభుత్వ టీచర్‌గా ఉండి ప్రైవేట్ స్కూల్ కోసం రీల్ చేశానని విమర్శలు రావడంతో తనను సస్పెండ్ చేశారని చెప్పిన ఆమె.. తిరిగి ఆరు నెలల తరవాత పోస్టింగ్ ఇచ్చారని గౌతమి తెలిపారు.కానీ, డీఈవో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అందుకే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడనని, పేద కుటుంబంలో జన్మించానని పేర్కొన్నారు. తన భర్త మద్దతుతో ఈ ఉద్యోగం సాధించానని, స్కూల్ లో ఎప్పుడూ సమయం వృథా చేయలేదన్నారు. డ్యూటీ టైంలో ఫోన్ కూడా మాట్లాడలేదని తెలిపారు. కేవలం ఇంట్లో ఉన్న సమయంలోనే రీల్స్ చేశానని, స్కూల్ విద్యార్థులకు తనను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఈవోను కలిసేందుకు అనేకసార్లు వెళ్లానని కానీ, తనకు అవకాశం ఇవ్వలేదని వాపోయారు. స్కూల్ విద్యార్థులు తనకు ఫోన్ చేసి బాధపడ్డారని చెప్పుకొచ్చారు.డీఈవోను కలిసేందుకు వెళితే ఛీ.. దూరం జరుగు అంటూ తనను అవమానించారని కన్నీటిపర్యంతం అయ్యారు. తనపై సమాజం నిందలు వేసిందని, అందుకే ఈ వృత్తిలో ఒక కొనసాగలేనని పేర్కొంటూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.












