హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం క్షీణించడానికి హైడ్రా తీసుకుంటున్న కఠిన చర్యలే కారణమనే ప్రచారాన్ని హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా ఖండించారు. మార్కెట్‌లో పేరుకుపోయిన లక్షలాది అమ్ముడుపోని ఫ్లాట్లు, ఆకాశాన్నంటిన ధరలు, ఆర్థిక మార్పులే ఈ పరిస్థితికి అసలు కారణమని విశ్లేషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మందగమనానికి చట్టబద్ధమైన తమ చర్యలకు ఎలాంటి సంబంధం లేదని రంగనాథ్ తేల్చి చెప్పారు. నగరంలో ప్రస్తుతం దాదాపు 3.5లక్షల ఫ్లాట్లు యజమానులు లేక అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని తెలిపారు. చదరపు అడుగు ధర రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఉండటంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు రూ.2కోట్లు వెచ్చించి ఈఎంఐల ఉచ్చులో చిక్కుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుత మందగమనం కేవలం మార్కెట్‌లో వస్తున్న అనివార్యమైన దిద్దుబాటు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
గతంలో నగరంలో రాజ్యమేలిన 'జంగిల్ రాజ్' సంస్కృతికి తెరదించి, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త నైతిక ప్రమాణాలు నిర్దేశిస్తున్నామని రంగనాథ్ వ్యాఖ్యానించారు. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విరుచుకుపడి ఇప్పటివరకు రూ.1.5లక్షల కోట్ల విలువైన 3,350 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ స్వాధీనం చేసుకున్న స్థలాలను భవిష్యత్తులో పేద, మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణ అవసరాలకు (LIG/MIG) వినియోగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాము పరిశ్రమను దెబ్బతీయడం లేదని, రాబోయే వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను సింగపూర్ తరహా నాగరిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఇదే క్రమంలో ఆస్తులు కొనుగోలు చేసే సామాన్య ప్రజలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. "సొంత కూతురికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు అబ్బాయి గుణగణాల గురించి ఎంతగా ఆరా తీస్తామో.. జీవితకాల సంపాదనను పెట్టి ఆస్తి కొనేటప్పుడు కూడా అంతే జాగ్రత్త వహించాలి" అని పిలుపునిచ్చారు.
కేవలం బిల్డర్లు ఇచ్చే లీగల్ రిపోర్టులు, బ్రోచర్లను గుడ్డిగా నమ్మకుండా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కోరారు. ప్రత్యామ్నాయంగా హెచ్‌ఎండీఏ లేక్స్ మ్యాప్‌లో చెరువు శిఖం (FTL) పరిధిని, భువన్ పోర్టల్ ద్వారా శాటిలైట్ డేటాను, ఆఖరికి స్థానిక ప్రాంతాల్లోని టీ కొట్ల వద్ద విచారించి భూమి వివాదరహితమైనదో లేదో సొంతంగా నిర్ధారించుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లోని 61శాతం జలాశయాలు ఇప్పటికే ఆక్రమణలకు గురయ్యాయని, నగరం కాంక్రీట్ శ్మశానంగా మారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఢిల్లీ, విజయవాడ, కరీంనగర్ వంటి నగరాల్లోనూ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మందగమనం ఉందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటమే హైడ్రా అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.












