కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈసారి భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో 39 పతకాలు సాధించారు. అయితే పతకాల పట్టికలోభారత్ ఈసారి నాలుగో స్థానంలో నిలిచింది. భారత ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి. ముఖ్యంగా బాక్సింగ్‌లో మన బాక్సర్లు అత్యుత్తమ పంచ్‌లతో 7 స్వర్ణాలు, 3 రజతాలు సాధించి మొత్తంగా 10 పతకాలతో భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు.
బాక్సింగ్‌తో పాటు వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత లిఫ్టర్లు ఎనిమిది పతకాలతో రాణించగా, అథ్లెటిక్స్, జూడో విభాగాల్లోనూ మన క్రీడాకారులు విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే, పోటీల చివరి రోజున భారత్‌కు ఎలాంటి కొత్త పతకాలు లభించలేదు. జూడో విభాగంలో ఇష్రూప్ నారంగ్, అవతార్ సింగ్, యశ్ ఘంగాస్, సైక్లింగ్ ఈవెంట్లలో రొనాల్డో సింగ్, లిషా దాస్ పతకాల పోరులో వెనుకబడటంతో ముందు రోజు సాధించిన 39 పతకాలతోనే భారత్ సరిపెట్టుకుంది.
ఆస్ట్రేలియా.. 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో మొత్తం 171 పతకాలు గెలుచుకుని ఎప్పటిలాగే అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఇంగ్లండ్.. 110 పతకాలతో (29 స్వర్ణాలు) రెండో స్థానంలో, కెనడా.. 62 పతకాలతో (19 స్వర్ణాలు) మూడో స్థానంలో నిలిచాయి. ఆతిథ్య స్కాట్లాండ్ దేశం కూడా భారత్‌తో సమానంగా 39 పతకాలు సాధించినప్పటికీ, భారత్ సాధించిన రజత పతకాల సంఖ్య (17) కంటే తక్కువగా (9) ఉండటంతో ఐదో స్థానానికి పరిమితమైంది.
దీంతో భారత్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా, న్యూజిలాండ్ (36 పతకాలు), నైజీరియా (24 పతకాలు) వరుసగా ఆరు, ఏడో స్థానాల్లో నిలిచాయి. పొరుగు దేశం పాకిస్థాన్ ఒకే ఒక కాంస్య పతకంతో పట్టికలో 36వ స్థానంతో సరిపెట్టుకుంది. సంప్రదాయక క్రీడలు కొన్ని తగ్గించినప్పటికీ, ఈసారి భారత క్రీడాకారులు చూపిన ప్రతిభ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.












