తెలంగాణ

Telangana: వరి సాగులో సత్తా చాటిన తెలంగాణ.. దేశవ్యాప్తంగా మూడో స్థానం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఉత్తరప్రదేశ్ జీవ వైవిధ్య మండలి రూ.73.26 లక్షలతో తొలి స్థానంలో నిలవగా.. పశ్చిమ బెంగాల్‌కు రూ.64.94 లక్షలు దక్కాయి. తెలంగాణ జీవ వైవిధ్య మండలికి రూ.50.59 లక్షలు లభించి దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.

వరి సాగులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటింది. కేవలం ధాన్యం ఉత్పత్తిలోనే కాదు... వరి వంగడాల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణలోనూ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించింది. కేంద్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం... దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం పరంగా తెలంగాణ మూడో స్థానంలో నిలవడం విశేషం.

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపట్టిన సాగునీటి విస్తరణ, రైతులకు నాణ్యమైన విత్తనాల అందుబాటు, ఆధునిక సాగు పద్ధతుల ప్రోత్సాహం వంటి చర్యలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం తెలంగాణ వ్యవసాయ రంగం బలోపేతానికి నిదర్శనంగా మారింది.

ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణలో తెలంగాణకు మరో గౌరవం దక్కింది. అంతర్జాతీయ విత్తన సంస్థ పియనీర్ ఓవర్సీస్ కార్పొరేషన్ చెల్లించిన రాయల్టీ నిధులను నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ‘యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్’ నిబంధనల ప్రకారం అర్హులైన సంస్థలకు పంపిణీ చేసింది. మొత్తం రూ.8.22 కోట్ల నిధుల్లో.. పరిశోధనా సంస్థలకు రూ.2.47 కోట్లు, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులకు రూ.5.75 కోట్లు కేటాయించారు.

ఈ పంపిణీలో హైదరాబాద్‌లోని ఐకార్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అత్యధికంగా రూ.2.43 కోట్లను అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా వరి వంగడాలను సంరక్షించడం, కొత్త రకాల అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగానే ఈ నిధులు లభించాయి.

రాష్ట్రాల వారీగా చూస్తే.. ఉత్తరప్రదేశ్ జీవ వైవిధ్య మండలి రూ.73.26 లక్షలతో తొలి స్థానంలో నిలవగా.. పశ్చిమ బెంగాల్‌కు రూ.64.94 లక్షలు దక్కాయి. తెలంగాణ జీవ వైవిధ్య మండలికి రూ.50.59 లక్షలు లభించి దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిచి రూ.25.88 లక్షలు పొందింది.

జీవ వైవిధ్య చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత... ఇంత భారీ మొత్తంలో రాయల్టీ నిధులను పంపిణీ చేయడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక వరి ఉత్పత్తిలో ముందంజ.. విత్తన సంరక్షణలో ప్రత్యేక గుర్తింపు.. జీవ వైవిధ్య పరిరక్షణలో జాతీయ స్థాయిలో ప్రశంసలు.. ఈ మూడు విజయాలతో తెలంగాణ వ్యవసాయ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించిందని ప్రశంశలు అందుకుంటుంది.

#Telangana#shines#paddy cultivation#ranks#third#nationwide
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి