ఒకప్పుడు కొత్త ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఏజెన్సీలే వినియోగదారులను సంప్రదించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు దాదాపు మూడు నెలలుగా నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాధానం దొరకడం లేదు.
మరోవైపు గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతుంటే... కొత్త కనెక్షన్లు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ముఖ్యంగా అంతర్జాతీయ పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని తెలుస్తుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ సరఫరాపై గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ సంస్థలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాయని.. ఇందులో భాగంగానే గ్యాస్ సరాఫరాలో మార్పులు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంటే... గ్యాస్ పూర్తిగా అయిపోయిందని కాదు. కానీ అందుబాటులో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వినియోగిస్తూ, కొత్త కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసే విధానాన్ని అనుసరిస్తున్నారని తెలియచేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో సిలిండర్ తీసుకోవాలనుకున్న వినియోగదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అలా ఇప్పటి వరకు ఎన్నో దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.
మరోవైపు ఒక సిలిండర్ ఖాళీ అయితే కొత్తది రావడానికి వారం నుంచి పది రోజుల వరకు ఎదురుచూడాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో చాలామంది ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లపై ఆధారపడుతున్నారు. కానీ దీని వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 33.5 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లు, 325 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నప్పటికీ.. కొండాపూర్, నార్సింగ్, కేపీహెచ్‌బీ, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో కొత్త కనెక్షన్ల కోసం డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
అయితే ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుంది? కొత్త కనెక్షన్లు, రెండో సిలిండర్ల జారీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే అంశంపై ఆయిల్ కంపెనీలు ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది..












