Varanasi: తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే బాహుబలి కి ముందు ఆ తర్వాత అని ఖచ్చితంగా అనాల్సిందే. అందుకు కారణం దర్శక ధీరుడిగా తెలుగు చిత్ర సీమలో అసాధారణమైన గుర్తింపును తెచ్చుకున్న ఎస్.ఎ.రాజమౌళి. బాహుబలి సిరీస్ ముందు వరకూ రాజమౌళి తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ విజయాలను అందుకున్నాయి. కానీ, మన తెలుగు సినిమా చాలా చిన్నది..మీడియం బడ్జెట్ సినిమాలే తీస్తారు..అన్న మాటకి చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు జక్కన్న.
బాహుబలి సినిమా అనేది సాధారణమైన కథే. గొప్పగా చెప్పుకునే కథ కాదు. కానీ, ఆ కథను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో అత్యంత భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో గ్రాండియర్‌గా రూపొందించి టెక్నికల్‌గా మనమేంటో నిరూపించాడు. అంతేకాదు, మొదట్లో ఫ్లాప్ అన్న బాహుబలి సినిమాను తారా స్థాయిలో నిల్చోపెట్టారు ప్రేక్షకులు.
ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2తో అప్పటి వరకూ ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ బద్దలయ్యాయి. ఇక, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్స్ కూడా తెచ్చిపెట్టాడు రాజమౌళి. ఇప్పుడు, ప్రపంచదేశాలలో మాట్లాడుకుంటుంది ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌లతో దాదాపు 1400 కోట్ల రూపాయలతో డా.కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి రాజమౌళి ఎప్పుడు మాట్లాడతాడా? అని అందరూ చాలా నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి ఆయన వారణాసి సినిమాను ఐమాక్స్ లో ఎందుకు తీస్తున్నారో రివీల్ చేశాడు. ఎంతో గ్రాండియర్ గా వారణాసి ఉంటుంది..రామాయణంలోని భారీగా స్క్రీన్‌పై కనిపించే వానర సేనలతో పాటుగా, 300 అడుగుల ఎత్తులో నిలువుగా ఉండే భారీ అంటార్కిటిక్ మంచు నిర్మాణాలు కూడా ఈ సినిమాలో చూడబోతున్నారు. వీటిని ఐమాక్స్ యాస్పెక్ట్ రేషియోలో మాత్రమే చూసి ఎంజాయ్ చేయగలరు. అందుకే, ఈ ఫార్మాట్ ని ఎంచుకున్నాము అని జక్కన్న వారణాసి సినిమాలోని సన్నివేశాల గురించి చెప్పుకొచ్చాడు. దీంతో, ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. కాగా, ఏప్రిల్ 7, 2027 లో 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ కాబోతోంది.












