* రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో
* 2023 ఎన్నికల్లో తొలిసారి గెలుపు
* గెలిచిన ఏడాదిన్నరలోపే రూ. 450 కోట్లకుపైగా అప్పులను సులువుగా చెల్లించిన వైనం
* రెండున్నరేళ్లుగా యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, వసూళ్లు
* ఎమ్మెల్యేపై దాదాపు 40కి పైగా క్రిమినల్ కేసులు.. అందులో భూకబ్జాలు, బెదిరింపులు
* 11 కంపెనీల పేరిట ఆరేళ్లలో 9 బ్యాంకుల నుంచి రూ. 470 కోట్ల అప్పులు
* 2023లో గెలవగానే మారిన సీన్.. వారం రోజుల్లో రూ. 450 కోట్ల అప్పు క్లియర్
* సాధారణ ఎమ్మెల్యే అక్రమార్జన ఇంత ఉంటే.. మంత్రులది ఎంత ఉంటుంది?
Congress Mla: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల్లోనే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల అప్పు క్లియర్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రజాప్రతినిధి అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు. గెలిచిన ఏడాదిన్నరలోపే రూ. 450 కోట్లకు పైగా అప్పులను అవలీలగా చెల్లించిన వైనం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
నియోజకవర్గంలో రెండున్నరేళ్లుగా యథేచ్ఛగా చెరువుల ఆక్రమణ, ఇసుక దందా, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్లు ఆ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేపై దాదాపు 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో ఎక్కువగా భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించిన కేసులే. కాప్రా భూకబ్జా అంశంలోనూ ఆ ఎమ్మెల్యే పేరు బయటపడింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు గాంధీభవన్‌ను ముట్టడించారు.
ఆ ఎమ్మెల్యే రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ, 2023 ఎన్నికల్లో తొలిసారిగా గెలిచారు. గెలిచిన ఏడాదిన్నరలోనే ఆయనగారి అక్రమ సంపాదన చూసి సొంత పార్టీ నేతలే అవాక్కవుతున్నారు. ఆ ఎమ్మెల్యే కుటుంబం వివిధ కమర్షియల్, బిజినెస్ కంపెనీలను నడిపిస్తోంది. 11 కంపెనీల పేరిట ఆరేళ్లలో 9 బ్యాంకుల నుంచి రూ. 470 కోట్ల అప్పులు తీసుకున్నారు. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా ప్రకటించాయి బ్యాంకులు. అయితే, 2023లో గెలవగానే సీన్ మొత్తం మారిపోయింది. వారం రోజుల్లో రూ. 450 కోట్ల అప్పు క్లియర్ అయ్యింది.
2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు రూ.26 కోట్లు. 2023లో రూ.54 కోట్లు ఆస్తులు మాత్రమే. కానీ, గెలిచిన కొన్ని రోజులకే 450 కోట్ల రూపాయల అప్పులను ఎలా క్లియర్ చేసేశారు అన్నది ఇప్పుడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒక సాధారణ ఎమ్మెల్యే అక్రమార్జన ఈ రేంజ్ లో ఉంటే ఇక మంత్రులది ఎంత ఉంటుంది? అనే చర్చ సొంత పార్టీ నేతలు, ప్రజల్లో మొదలైంది.












