AI Impact: ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధస్సు).. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఏఐ హవా నడుస్తోంది. అన్ని చోట్ల ఏఐ వాడకం గణనీయంగా పెరిగింది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఏఐ వినియోగాన్ని భారీగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తమ టెక్నాలజీ వ్యవస్థలను అప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఏఐ వచ్చాక చాలా పనులు ఈజీ అయిపోయాయని టెక్ కంపెనీలు చెబుతున్నాయి. ఏఐని వేగవంతమైన సాంకేతిక విప్లవంగా అభివర్ణిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏఐ కారణంగా గణనీయమైన మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నాణెనికి రెండు వైపులు ఉన్నట్లు.. ఏఐ రాకతో లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయి. ఈ సాంకేతిక విప్లవం ఉద్యోగ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఏఐ రాకతో లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమే అనేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ కాపీ రైటర్ పై ఏఐ తీవ్రమైన ప్రభావమే చూపింది. అతడి జీవితమే తలకిందులైపోయింది. ఏఐ రాకముందు అతడి నెల సంపాదన 2లక్షలుగా ఉండేది. ఏఐ వచ్చాక అతడి సంపాదన 40వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కాపీ రైటర్ చెప్పుకుని తీవ్ర ఆవేదన చెందాడు.
''ఒకప్పుడు నా సంపాదన నెలకు 2లక్షలుగా ఉండేది. ఏఐ రావడంతో నా జీతం 40వేలకు పడిపోయింది. 2026లో ఏఐ వచ్చాక నా ప్రాజెక్ట్‌లు పోయాయి. ప్రస్తుతం తెలంగాణ టూరిజంను హ్యాండిల్ చేసే ఒక ఏజెన్సీలో నెలకు 40వేల జీతానికి చేరా. ఇది గతంలో కంటే పెద్ద రోల్ అయినా జీతం ఇంత తక్కువ ఉండటం చాలా బాధగా ఉంది. ఐదుగురు చేయాల్సిన పని నేను ఒక్కడినే చేస్తున్నా'' అంటూ ఆ కాపీరైటర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఆరు అంకెల నెలవారీ ఆదాయం, రిమోట్ వర్క్ స్వేచ్ఛ, అభివృద్ధి చెందుతున్న ఫ్రీలాన్స్ కెరీర్.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఆ కాపీ రైటర్ జీవితం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఒక్కసారిగా మారిపోయింది. ఇవన్నీ కొన్ని వారాల్లోనే మాయమైపోయాయి. "నెలకు 2 లక్షల నుండి 40 వేల జీతానికి పడిపోయాను. జీవితకాలపు పతనం" అనే టైటిల్ తో రెడ్డిట్‌లో అతడు పెట్టిన పోస్ట్ చర్చకు దారితీసింది. AI రాకతో తాను క్లయింట్‌లను, కాంట్రాక్టులను కోల్పోయానని, తన నెల సంపాదన 2 లక్షల నుండి 40వేలకు పడిపోయిందని ఆ వ్యక్తి వాపోయాడు.
తాను 8 సంవత్సరాల క్రితం ఫ్రీలాన్సింగ్ ప్రారంభించి, కేవలం 18 ఏళ్లకే తన మొదటి పూర్తికాలపు రిమోట్ కాంట్రాక్ట్‌ను సంపాదించానని ఆ రైటర్ చెప్పాడు. కాలేజీ చదువు మధ్యలోనే మానేసినా క్రమంగా ఉన్నత స్థానాలకు చేరుకుని, చివరికి 22 ఏళ్ల వయసుకే లీడ్ కాపీ రైటర్‌గా మారి, నెలకు ఆరు అంకెల ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించాను. అయితే, 2026లో అంతా తలకిందులైందని అతను తెలిపాడు
"2026 నాకు శాపంగా మారింది. కేవలం 2 వారాల వ్యవధిలోనే ప్రాజెక్టులన్నీ కోల్పోయా. లక్షల్లో ఉండే జీతం వేలకు తగ్గింది. కంపెనీలు క్రియేటివ్ పాత్రల స్థానంలో ఏఐ (AI) సాధనాలను వాడటం మొదలుపెట్టాయి. దాని వల్లే నన్ను ఉద్యోగం నుండి తొలగించారు. చివరికి, తెలంగాణ పర్యాటక శాఖ మార్కెటింగ్ చూసుకునే హైదరాబాద్‌కు చెందిన ఒక ఏజెన్సీలో నాకు ఉద్యోగం దొరికింది. జాబ్ దొరికినందుకు కృతజ్ఞతతో ఉన్నా జీతంలో కోతను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది'' అని ఆ కాపీ రైటర్ వాపోయాడు.
''నాకిప్పుడు వచ్చే జీతం తక్కువగా ఉంది. అంతేకాదు సృజనాత్మకంగా సంతృప్తిగా కూడా లేదు. నా చుట్టూ ఉన్నవారిలో సృజనాత్మకత చాలా తక్కువ. వాళ్ళు ఏదో పని చేస్తున్నారు అంతే. పని మీద వారికి ప్రేమ లేదు, అభిరుచి లేదు. ఐదుగురి పనిని నేను ఒక్కడినే చేస్తున్నా. నా కెరీర్ లో ఇదే అతిపెద్ద పతనం'' అంటూ ఆ కాపీ రైటర్ తన మనోవేదనను పంచుకున్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియా యూజర్లను కదిలించింది. AI యుగంలో సృజనాత్మక నిపుణులు ఎదుర్కొంటున్న అనిశ్చితికి ఇది అద్దం పడుతోందన్నారు. కాగా, మారుతున్న సాంకేతికతలకు అనుగుణంగా మనమూ మారాలని.. టెక్నాలజీ పరంగా అప్ గ్రేడ్ అవ్వాలని, స్కిల్స్ ను మెరుగుపరుచుకుంటూ, కొత్త అవకాశాలను వెతుక్కోవాలని మరికొందరు సూచించారు.












