తెలంగాణ

ధాన్యం అక్రమాలకు చెక్.. రంగంలోకి 'SHT'

రచన: Mahesh5 నిమిషాల పఠనం

SHT Strategy: తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వేళ ఏటా తెరపైకి వచ్చే దళారుల దందా, ధాన్యం రీసైక్లింగ్, నకిలీ రశీదుల అక్రమాలకు శాశ్వత బ్రేక్ వేసేందుకు పౌర సరఫరాల శాఖ అత్యంత కఠినమైన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది.

SHT Strategy: తెలంగాణలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల వేళ ఏటా తెరపైకి వచ్చే దళారుల దందా, ధాన్యం రీసైక్లింగ్, నకిలీ రశీదుల అక్రమాలకు శాశ్వత బ్రేక్ వేసేందుకు పౌర సరఫరాల శాఖ అత్యంత కఠినమైన యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రాన్ని ముంచెత్తనున్న రికార్డు స్థాయి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సరికొత్త ‘SHT’ (స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్) అస్త్రాన్ని బయటికి వదిలారు. ప్రతి లారీకి జీపీఎస్ ట్రాకింగ్, మిల్లులపై మెరుపు దాడులకు ప్రత్యేక యాప్, నకిలీ షీట్లకు చెక్ పెట్టేందుకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రంగంలోకి దిగారు.

ధాన్యం తరలింపుపై ‘జీపీఎస్’ నిఘా..

ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) నుంచి మిల్లులకు తరలించే క్రమంలో పక్కదారి పట్టడం లేదా కాగితాల్లోనే కొనుగోళ్లు చూపించి అక్రమాలకు పాల్పడటం గతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి అటువంటి తప్పిదాలకు ఏమాత్రం తావులేకుండా ప్రతి వాహనానికి తప్పనిసరిగా 'జీపీఎస్' ట్రాకింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఏ లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో క్షణక్షణం మానిటర్ చేయనున్నారు. అంతేకాకుండా, అధికారులు మిల్లుల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేయడానికి సరికొత్త 'ఫిజికల్ వెరిఫికేషన్ మొబైల్ యాప్'ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా నకిలీ రశీదులు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని, క్రిమినల్ చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

సరిపోని గోదాములు..

ఈ ఖరీఫ్‌లో రానున్న 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడం అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. సాధారణ ప్రభుత్వ గోదాములు సరిపోకపోవడంతో, అధికారులు ఊహించని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. సాధారణ గోడౌన్లతో పాటు మూతపడిన రైస్ మిల్లులు, పారిశ్రామిక షెడ్లు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, చివరకు పెద్దపెద్ద ఫంక్షన్ హాళ్లను కూడా ధాన్యం నిల్వ కేంద్రాలుగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యాప్ విధానంలో ఓపెన్ ప్లింత్‌లపై కూడా ధాన్యం పాడవకుండా పటిష్ట కవర్లు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్టోబర్ మొదటి వారంలోనే కొనుగోళ్లు..

అకాల వర్షాలు, తుఫానుల వల్ల రైతుల కష్టం రోడ్లపాలు కాకుండా చూసేందుకు అక్టోబర్ మొదటి వారం నాటికే కొనుగోలు కేంద్రాలన్నీ సర్వసన్నద్ధం కానున్నాయి. రైతులకు తూకాల్లో మోసాలు జరగకుండా, నాణ్యత దెబ్బతినకుండా ప్రతి కేంద్రంలోనూ తేమ కొలిచే అధునాతన యంత్రాలు, డ్రయ్యర్లు, క్లీనర్లను ముందస్తుగానే అందుబాటులో ఉంచుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద బస్తాలు ఎత్తడానికి హమాలీల కొరత లేకుండా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.

మొత్తంగా, క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పిస్తూనే, మరోవైపు దళారులు, అక్రమార్కుల ఆట కట్టించేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఈసారి పూర్తి టెక్నాలజీ ఆధారిత వ్యూహంతో సమరశంఖం పూరించింది.

#Telangana Paddy Procurement#Telangana Paddy Purchase#Telangana Paddy Procurement 2026#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి