Janwada Farmhouse: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం జన్వాడ ఫాంహౌస్ వద్దకు వెళ్లి అక్కడి భూములను పరిశీలించింది. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నాలాపై జన్వాడ ఫాంహౌస్ నిర్మించారని చెప్పారు. ఈ వ్యవహారంలో జన్వాడ ఫాంహౌస్ తనదే అంటున్న ప్రదీప్ రెడ్డి అడ్వకేట్ రాజేశ్వరరావు స్పందించారు.
ప్రదీప్ రెడ్డికి చెందిన జన్వాడ ఫాంహౌస్ పై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దాడికి రావడం దుర్మార్గం అని అడ్వకేట్ రాజేశ్వరరావు మండిపడ్డారు. ప్రదీప్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా ఎలాంటి పనులకు పాల్పడలేదని ఆయన తెలిపారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తి భూమిపైకి రావడం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తిపై దాడికి రావడం అంటే రాజ్యాంగంపై దాడి చెయ్యడమే అని అన్నారు. 3, 4 ఎకరాల్లో ఉన్న ఫాంహౌస్ పై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు దాడికి వచ్చారని రాజేశ్వరరావు ఆరోపించారు. చట్టాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రైవేట్ భూముల్లోకి రావడం చట్ట వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు.
''కాంగ్రెస్ నేతలు ఫాంహౌస్ వద్దకు వచ్చి ఎవరెవరో పేర్లపై భూములు ఉన్నాయని అంటున్నారు. వ్యక్తుల పేర్లపై భూములు ఉండడం తప్పా? భూములు అమ్మడం, కొనుక్కోవడం మనందరి హక్కు. ప్రదీప్ రెడ్డి ఫాంహౌస్ పై ఉల్లంఘనలు ఉంటే అధికారులు నోటీసులు ఇస్తారు. ప్రాపర్టీని వ్యక్తులకు బదలాయించడంపై రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రదీప్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ ఎక్కడా నిర్మించలేదు.
నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ కట్టి ఉంటే అధికారులు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇస్తే సమాధానం ఇచ్చేందుకు లేటైతే తప్పేంటి?'' అని ప్రదీప్ రెడ్డి అడ్వకేట్ రాజేశ్వరరావు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందాన్ని ప్రశ్నించారు.









