తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం రోజు రోజుకు హిట్ ఎక్కుతుంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో మొదలైన పొలిటికల్ ఫైర్.. ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలనల వరకు వెళ్లింది. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, కాంగ్రెస్ నేతలు వరుసగా ఆయా ప్రాంతాల్లో పర్యటించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
మొదట సిద్దిపేట జిల్లాలో ఎర్రవల్లి, వెలికట్ట, రంగనాయక సాగర్ పరిసరాల్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం భూములను పరిశీలించింది. రెవెన్యూ అధికారులతో రికార్డులు, మ్యాపులు పరిశీలిస్తూ పలు భూముల యాజమాన్యం, రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు సంధించింది. కాంగ్రెస్ నేతలు చేసిన ఈ ఆరోపణలపై విచారణ తర్వాత నిజాలు తెలనున్నాయి.
మరోవైపు నేటి శనివారం అదే రాజకీయ దూకుడు జన్వాడ వైపు మళ్లింది. ప్రత్యేక బస్సులో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం జన్వాడ ఫామ్‌హౌస్ పరిసరాలకు చేరుకోవడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు భూముల రికార్డులు, యాజమాన్య వివరాలు, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై ప్రశ్నలు లేవనెత్తారు. నాళా ఆక్రమణ జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని వారు ఆరోపిస్తూ హైడ్రా, స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ సమయంలో జన్వాడ ఫామ్‌హౌస్ తనదేనని, 2019లో చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశానని ప్రదీప్‌రెడ్డి వెల్లడించారు. కేటీఆర్ తనకు చిన్ననాటి స్నేహితుడని, ఆయనకు ఆస్తిని లీజుకు మాత్రమే ఇచ్చానని తెలిపారు. ప్రభుత్వం లేదా అధికారులు ఏవైనా అనుమానాలు ఉంటే నోటీసులు ఇవ్వాలని, చట్టపరమైన విచారణకు తాను సహకరిస్తానని స్పష్టం చేశారు.
ఒకవైపు జన్వాడ.. మరోవైపు ఎర్రవల్లి.. ఇంకోవైపు సిద్దిపేటలోని భూములు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంబంధించిన భూముల అంశాలను కాంగ్రెస్ వరుసగా తెరపైకి తీసుకొస్తుండగా.. బీఆర్ఎస్ కూడా ఎదురుదాడికి దిగుతోంది. కేటీఆర్ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసే దర్యాప్తు సంస్థలతో కాకుండా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని సవాల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇదే సమయంలో తెలంగాణలో 22ఏ భూముల అంశం కూడా రాజకీయంగా వేడెక్కుతోంది. భూముల హక్కులు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, రికార్డుల మార్పులు వంటి అంశాలు అసెంబ్లీ చర్చల్లోనూ ప్రధానంగా మారాయి. దీంతో ఇప్పుడు భూముల వివాదం ఒక్క జన్వాడకే పరిమితం కాకుండా.. తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరో పెద్ద పోరాటానికి కేంద్రబిందువుగా మారుతోంది.
మరోవైపు రాష్ట్రంలో జన్వాడ భూములపై హైడ్రా, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఎర్రవల్లి నుంచి జన్వాడ వరకు తెరపైకి వస్తున్న ఆరోపణలకు అధికారిక రికార్డులు ఏం చెప్పబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో భూముల ఎపిసోడ్ ఎక్కడికి దారితీస్తుందనేది ఉత్కంఠంగా మారింది.











