బీసీ జనాభా లెక్కల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీలను ప్రత్యేకంగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి స్వాగతించారు. ఈ అంశంపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
2027లో జరగనున్న జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి.. కులాల వారీగా సమగ్ర వివరాలను సేకరించాలని కుమారస్వామి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించిన బీసీ కులాల జాబితాల ఆధారంగా జనాభా వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇలా చేస్తే బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
అంతేకాదు.. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని కోరారు. 2024లో తెలంగాణలో నిర్వహించిన కుల సర్వే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని.. జాతీయ స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో కులాల వారీగా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
గతంలో 2011లో జరిగిన సామాజిక, ఆర్థిక, కుల గణనలో ఎదురైన సమాచార క్రమబద్ధీకరణ సమస్యలు మళ్లీ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీల వాస్తవ జనాభా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వెనుకబాటుతనం, అభివృద్ధి అవసరాలను గుర్తించేందుకు విశ్వసనీయమైన గణాంకాలు అవసరమని స్పష్టం చేశారు.
విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయ విధానాల రూపకల్పనకు ఈ వివరాలు కీలక ఆధారంగా నిలుస్తాయని పేర్కొంటూ.. బీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధమైన జాతీయ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు.












