KTR Janwada Farmhouse: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఫాంహౌస్ దగ్గర భూములను పరిశీలించింది. బీఆర్ఎస్ నేతల భూ అక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడానికి తామంతా జన్వాడ ఫాంహౌస్ కు వచ్చామని ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. ప్రభుత్వ భూములను ఎంత మేరకు ఆక్రమించుకున్నారో చూశామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. జన్వాడ ఫాంహౌస్ నాలాపై కట్టారని మల్లు రవి ఆరోపించారు. ఫాంహౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవన్నారాయన. అసలు ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉందో స్పష్టత లేదని చెప్పారు.
''ఇది నా ఇల్లు కాదు.. స్నేహితుడి నుంచి లీజుకు తీసుకున్నా అని కేటీఆర్ అంటున్నారు. కానీ, లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు ఇప్పటివరకు ఎక్కడా ఎవరూ చూపలేదు. ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకు ఏమొచ్చింది? 22ఏపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని తెలిసి ముందే అసెంబ్లీ గేట్ దగ్గర గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ లోపలికి వచ్చి పోడియం దగ్గర హంగామా చేశారు. తమకు తాముగా కావాలని సభ నుంచి సస్పెండ్ అయ్యారు.
కేసీఆర్ ఫాంహౌస్ లో ప్రభుత్వ భూమి ఎంతమేర ఉంది? దళితులు, పేదలకు చెందాల్సిన భూమి ఎవరి ఆధీనంలో ఉందో నిగ్గు తేల్చాలని అసెంబ్లీ వేదికగా అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పార్లమెంట్, మండలి సభ్యులు బస్సులో ఫాంహౌస్ కు వచ్చాము. కేటీఆర్, హరీశ్ రావు ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఫిరంగి నాలాపై అక్రమ కట్టడాలు కట్టుకోవడం అంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటమే.
నాలాపై ఎలా నిర్మాణం చేశారో ప్రజలకు కేటీఆర్ చెప్పాలి. 111 జీవో ఉండగా ఈ అక్రమ కట్టడం ఎలా నిర్మించారో చెప్పాలి. బీఆర్ఎస్ నేతలు బట్ట కాల్చి ప్రభుత్వం మీద వేయడం మానండి. తప్పనిసరిగా విచారణ జరుగుతుంది. బడా బాబులు (కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు) ఎంతటి వారైనా వదిలేది లేదు. దోచుకున్న ప్రజా ఆస్తులపై విచారణ జరిపి వాటిని పేదలకు పంచాలి'' అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరింది.












