KTR vs Komatireddy: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగునీటి వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటడంతో స్టార్ట్ అయిన ఈ వాటర్ వార్.. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల, ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుపోవడంపై గులాబీ, హస్తం నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
కేటీఆర్ పాదయాత్ర హెచ్చరిక..
సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మిర్యాలగూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు నిరసన సభ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే హాలియా నుంచి కోదాడ వరకు పాదయాత్ర చేపడతానని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సైతం జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీరు అందించడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
ఫాంహౌస్‌కు పాదయాత్ర చేయ్: మంత్రి కోమటిరెడ్డి
కేటీఆర్ హెచ్చరికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతే దీటుగా రియాక్ట్ అయ్యారు కేటీఆర్ పాదయాత్ర చేస్తే తానూ పాదయాత్ర చేస్తానని సవాల్ విసిరారు. అయితే కేటీఆర్ నల్గొండ జిల్లాలో కాకుండా, హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌కు పాదయాత్ర చేయాలని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించేందుకు నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కేసీఆర్ పూర్తి అనుమతులు ఇచ్చారని, డెడ్ స్టోరేజీ ఉన్నప్పుడు కూడా 8 టీఎంసీలు తీసుకునేలా ఒప్పందాలు చేసుకున్న పాపం గులాబీ పార్టీదేనని ధ్వజమెత్తారు. ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తుంటే కేఆర్‌ఎంబీకి లేఖ రాసి అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
మరోవైపు ఎల్‌నినో ప్రభావం వల్ల తాగునీటి ఎద్దడి రాకుండా చెరువులు నింపడానికే సాగర్ జలాలను ప్రాధాన్యతగా వాడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే బీఆర్ఎస్ నేతలు వాటర్ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కృష్ణా జలాల చుట్టూ ఇరు పార్టీల నేతల మధ్య సాగుతున్న ఈ వాటర్ వార్ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తోంది.












