సినిమా

CKalyan: సినీ నిర్మాత సి.కల్యాణ్‌పై మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు.. ప్లాట్లు కబ్జా చేశారంటూ ఆరోపణలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సీ.కల్యాణ్‌తో పాటు పలువురు వ్యక్తులపై మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో స్థల కబ్జా ఫిర్యాదు నమోదైంది. మాదాపూర్ పరిధిలోని సున్నంచెరువు ప్రాంతంలో ఉన్న తమ ప్లాట్లను నిర్మాత సీ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారని సియాట్ (SEAT) సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ సింగ్, ప్లాట్ల యజమానులు పోలీసులకు రాతపూర్వకంగా పిటిషన్ సమర్పించారు. గట్ బేగంపేట్‌లోని సర్వేనంబర్లు 12, 12ఎ, 13 పరిధిలో తమకు చెందిన ప్లాట్లు ఉన్నాయని ఈ సందర్భంగా ప్లాట్ యజమానులు వెల్లడించారు.

 శనివారం ఉదయం నిర్మాత సీ.కల్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత అనే వ్యక్తులతో కలిసి తమ ప్లాట్లలోకి చొరబడ్డారని బాధితులు ఆరోపించారు. స్థలంలో అక్రమంగా బ్లూ రేకుల షీట్లు అమర్చి, అసలు యజమానులు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు వ్యక్తులు ఈ ప్లాట్లను కబ్జా చేయడానికి ప్రయత్నించారని, నాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెనక్కి తగ్గారని, ఇప్పుడు మళ్లీ కొత్త వ్యక్తులు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని సభ్యులు తెలిపారు.

 తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జాకు పాల్పడుతున్న నిర్మాత సీ.కల్యాణ్‌తో పాటు ప్రకాష్ ధారక్, ప్రేమలతలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాట్ ఓనర్లు పోలీసులను విజ్ఞప్తి చేశారు. శ్యామ్ సింగ్ నాయకత్వంలో వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన మాదాపూర్ పోలీసులు, సర్వే నంబర్లు, డాక్యుమెంట్లను పరిశీలించి తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు.

 సియాట్ సొసైటీకి చెందిన విలువైన భూములను కబ్జాదారుల బారిన పడకుండా వెంటనే కాపాడాలని బాధితులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. దశాబ్దాల క్రితం ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన స్థలాలకు అన్ని రకాల అనుమతులు, సరైన పత్రాలు ఉన్నప్పటికీ, సినీ రంగ ప్రముఖులు, స్థానిక ప్రభావశీల వ్యక్తులు అక్రమంగా చొరబడటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల విచారణ అనంతరం నిందితులపై కేసు నమోదు చేయడమే కాకుండా, తాము ఏర్పాటు చేసుకున్న హద్దులను పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలని స్థల యజమానులు ఆవేదనతో కోరారు.

#CKalyan#MadhapurPoliceStation#SunnamCheruvu#LandGrabAllegations#HyderabadNews#FilmProducerCKalyan#TollywoodNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి