చెడపకురా చెడేవు అంటారు. కాలం కూడా మాటు వేసి కాటు వేస్తే వచ్చే కిక్కు దిమ్మతిరిగిపోయేలా ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి సీన్ రిపీట్ అయ్యింది.. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు.. ఆ తర్వాత అధికార మార్పుతో మరో కోణంలో చర్చకు రావడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కాలం మారుతున్న కొద్దీ అదే అంశానికి సంబంధించిన రాజకీయ లెక్కలు కూడా మారిపోతుండటం. నిన్నటి నిర్ణయాలకు నేటి రాజకీయ పరిస్థితులు కొత్త అర్థాలు చెబుతున్నాయా అన్న చర్చ మొదలైంది.
అదే తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం.. ప్రస్తుతం ఈ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన భూముల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ హయాంలో భూములకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చర్చలోకి వచ్చాయి. ఇక ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ దాదాపు 700 ఎకరాల మేర విస్తరించి ఉందని.. అందులో 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూములు కలిసిపోయినట్లుగా రేవంత్ ఆరోపించారనే విషయం తెలిసిందే..
అలా సీఎం అసెంబ్లీ ప్రకటన వెలువడిన వెంటనే జిల్లా కలెక్టర్ మొదలుకొని రెవెన్యూ అధికారులు భూముల లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగారు. ఈ సమయంలో కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారని పొలిటికల్ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ సీఏం గా ఉన్న సమయంలో తన మంత్రివర్గంలో కీలక మంత్రిగా వ్యవహరించే ఈటల రాజేందర్ విషయంలో తరహాలో వ్యవహరించారని..తాజాగా ఆయన ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్లు చర్చించుకొంటున్నారట..
సొంత మంత్రి విషయంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తే.. ప్రతిపక్ష నేత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న నిర్ణయంలో తప్పేముందనే వాదనలు వినిపిస్తున్నాయట.. ఇక 2021 ఏప్రిల్-మే నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పై వరుసగా భూఆక్రమణ ఆరోపణలు రావటం..ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం తెలిసిందే.
ఈ వివాదానికి సంబంధించి అప్పట్లో వినిపించిన ప్రధాన ఆరోపణ.. ఈటల కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ సంస్థ కోసం పేదలకు కేటాయించిన దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా కబ్జా చేశారని సీఎంవోకు కంప్లైంట్ చేసినట్లుగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ టీంలు రాత్రికి రాత్రే విచారణ చేయటం.. సుమారు 85 ఎకరాల అసైన్డ్ భూమిని జమునా హ్యాచరీస్ ఆక్రమించినట్లుగా.. అనుమతులు లేకుండా గోదాములు నిర్మించినట్లుగా రిపోర్టులు ఇవ్వటం తెలిసిందే.
ఓవైపు మెదక్ వివాదం నడుస్తున్న సందర్భంలోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం దేవరయాంజల్ లోని శ్రీసీతారామ స్వామి దేవాలయ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. అక్కడ భూములకు సంబంధించి దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను ఈటల రాజేందర్.. ఆయన అనుచరులు ఆక్రమించుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. ముందస్తు అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ గోదాలు.. విలాసవంతమైన గెస్టు హైస్ లు నిర్మించినట్లుగా నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించారు.
ఇదే సమయంలో మేడ్చల్ జిల్లా పరిధిలోని రావల్ కోల్ గ్రామానికి చెందిన ఒకరు చేసిన ఫిర్యాదుతో ఈటల అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని కబ్జా చేసిన ఆరోపణలు రావటంతో విజిలెన్స్ తో విచారణకు ఆదేశించారు. అప్పట్లో తనపై వచ్చిన ఆరోపణల్ని ఈటల దంపతులు తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. రాజకీయ కక్షసాధింపుతో ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ సందర్భంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయటం అప్పట్లో రాజకీయ సంచలనంగా మారింది.
అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే. కట్ చేస్తే.. తాజా పరిణామాల్ని చూస్తే.. ఇంచుమించు ఇదే తరహా ఆరోపణలతో సీఎం రేవంత్ విచారణకు ఆదేశించటం తెలిసిందే. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం సమీప పరిసరాల్లో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ.. రికార్డుల పరిశీలన చేపట్టారు. ఎర్రవల్లితో పాటు పొరుగు గ్రామాలైన వెంకటాపురం.. వరదరాజుపురం సరిహద్దుల పరిధిలోని సర్వే నంబరు 325 మీద అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు.
ఫామ్ హౌస్ విస్తరణలో భాగంగా దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ.. అసైన్డ్ భూముల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారులు ఎర్రవల్లి పరిసర భూముల్లో కొలతలు వేయటం.. సర్వే చేసే ప్రయత్నం చేయగా.. స్థానిక రైతులు అడ్డుకోవటం కనిపించింది.వీటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు తమ పని తాము చేసుకుపోయినట్లుగా మీడియా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. కాలం మహా సిత్రమైందని.. అప్పట్లో ఈటలకు ఎదురైన అనుభవం లాంటిదే తాజాగా కేసీఆర్ కు ఎదురైనట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.












