TG: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ నాయకుల ఫాంహౌస్‌లు, భూ సరిహద్దుల వివాదాలే నిత్యం పతాక శీర్షికల్లో నిలుస్తున్న వేళ.. వేలాది మంది సామాన్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదపుటంచున పడిన సంగతి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. సాంకేతిక విద్యా రంగాన్ని సమూలంగా మార్చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన వివాదాస్పద ‘జీవో ఎంఎస్ నంబర్ 97’ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలను రగిలిస్తోన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా పేద, మధ్యతరగతి బిడ్డలకు ఇంజినీరింగ్ భరోసాగా నిలిచిన పాలిటెక్నిక్ వ్యవస్థను ప్రభుత్వం నామరూపాల్లేకుండా చేస్తోందన్న ఆందోళనతో విద్యార్థులు తరగతులు బహిష్కరించి రహదారులపై బైఠాయిస్తున్నారు.
'శక్తి' పేరుతో వ్యవస్థల విచ్ఛిన్నం?
జూలై 3న ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా జారీ చేసిన జీవో 97 ప్రకారం.. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు, డిప్లొమా కోర్సులను నూతనంగా ఏర్పాటైన 'శక్తి' (SHAKTI - స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) శాఖతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మారుస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి ముసుగులో తీసుకువచ్చిన ఈ మార్పు.. సాంకేతిక విద్యా ప్రమాణాలకే గొడ్డలిపెట్టుగా మారిందని విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
విద్యార్థుల ఆందోళనకు దారితీసిన కీలక అంశాలు..
దశాబ్దాల చరిత్ర కలిగిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుందని విద్యార్థులు భయపడుతున్నారు. పూర్తిస్థాయి డిప్లొమా సర్టిఫికెట్ల స్థానంలో సాధారణ షార్ట్-టర్మ్ స్కిల్ సర్టిఫికెట్లను ఇస్తే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు కోల్పోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
డిప్లొమా పూర్తి చేసి ఈసెట్ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలోకి ప్రవేశించే అద్భుతమైన లేటరల్ ఎంట్రీ వ్యవస్థకు ఈ జీవోతో చరమగీతం పాడుతున్నారన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. దీనివల్ల గ్రామీణ, పేద విద్యార్థులు ఇంజినీర్లు అయ్యే కల శాశ్వతంగా కల్లలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పేరుతో విద్యా సంస్థల నిర్వహణను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రమాదం ఉందని, దీనివల్ల ఫీజులు భారీగా పెరిగి సాంకేతిక విద్య పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని వాపోతున్నారు.
నేతల భూముల రచ్చ ముఖ్యం.. విద్యార్థుల భవిత ముఖ్యం కాదా?
రాష్ట్రంలో ఏ చిన్న భూ వివాదం తలెత్తినా మైకుల ముందు గంటల తరబడి సవాళ్లు విసురుకునే అధికార, ప్రతిపక్ష నేతలకు.. భవిష్యత్తు కోసం కన్నీరుమున్నీరవుతూ రోడ్డెక్కిన తమ రోదనలు వినిపించకపోవడం దారుణమనే అభిప్రాయం పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి, జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఈ పోరాటం రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారుతుందని విద్యార్థి లోకం హెచ్చరిస్తోంది.












