తెలంగాణలో భూములు, ప్లాట్ల కొనుగోలుదారులను ఏళ్ల తరబడి వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన సమస్య 'సెక్షన్ 22-ఏ'. నిషేధిత భూముల జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు కాక, ఉన్న ఆస్తులను అమ్ముకోలేక లక్షలాది మంది సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వేదికగా సీఎం చేసిన ప్రకటనను అమలు చేస్తూ, 22-ఏ సమస్యలను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం అధికారికంగా ఉన్నత స్థాయి కమిటీని రంగంలోకి దించింది. ఈ మేరకు శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు.
రంగంలోకి ఉన్నత స్థాయి కమిటీ: జీవో నెం. 564 జారీ
నిషేధిత ఆస్తుల జాబితాపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం జీ.ఓ.ఆర్.టి నెం. 564ను జారీ చేసింది. సీసీఎల్‌ఏ (CCLA) డి.ఎస్.లోకేష్ కుమార్ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ త్రిసభ్య కమిటీలో.. న్యాయశాఖ కార్యదర్శి పాపి రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు. నిషేధిత జాబితాలోని అడ్డంకులను తొలగించి, అర్హులైన బాధితులకు త్వరితగతిన ఊరట కల్పించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.
ఎల్బీనగర్ వాసులకు గుడ్ న్యూస్: 9,700 ప్లాట్ల క్రమబద్ధీకరణ
రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. 118 జీవో కింద రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పరిధిలోని దాదాపు 9,700 ప్లాట్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం అధికారిక మెమోను విడుదల చేసింది. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తున్నట్లు, ఇది నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న యజమానులు స్థానిక అధికారులను సంప్రదించి తమ ప్లాట్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
HMDA, GHMC లేఅవుట్లకు 22-ఏ నుంచి విముక్తి
ఈ ప్రకటనలో మరో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ వంటి అధికారిక అనుమతులు పొందిన లేఅవుట్లలోని భూములు కూడా కొన్నిచోట్ల రెవెన్యూ రికార్డుల్లో 22-ఏ కింద నమోదై ఉన్నాయి. దీనివల్ల ప్లాట్లు కొన్న సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుని, అలాంటి లేఅవుట్లను 22-ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
సింగరేణి ప్రాంతాల్లో 'జీవో 76'తో పరిష్కారం
సింగరేణి పరిధిలోని ఇళ్ల స్థలాల సమస్యకు కూడా సర్కార్ తెరదించనుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకొచ్చిన జీవో 76ను అనుసరించి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్కడి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పట్టాలెక్కిస్తామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రస్తావించిన 10 నుంచి 12 కీలక రెవెన్యూ అంశాలపై నెల రోజుల వ్యవధిలోనే సమగ్ర నిర్ణయాలు తీసుకుని, 22-ఏ దరఖాస్తుదారులకు పూర్తి ఉపశమనం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రియల్ ఎస్టేట్ రంగానికి, సామాన్య భూ యజమానులకు భారీ ఊరట లభించినట్లయింది.












