KTR Janwada Farmhouse: కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం జన్వాడ ఫాంహౌస్‌కు వెళ్లింది. ఫాంహౌస్ దగ్గర భూములను పరిశీలించింది. బీఆర్ఎస్ నేతల భూ అక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడానికి తామంతా జన్వాడ ఫాంహౌస్ కు వచ్చామని ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. ప్రభుత్వ భూములను ఎంత మేరకు ఆక్రమించుకున్నారో చూశామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
అక్రమంగా జన్వాడ ఫాంహౌస్ నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నాలాను కబ్జా చేసి ఫాంహౌస్ కట్టారని చెప్పారు. జన్వాడ ఫాంహౌస్ కేటీఆర్ ది కాదు.. నాదే అని ప్రదీప్ రెడ్డి అంటున్నారు.. అసలు ప్రదీప్ కి ఫాంహౌస్ భూమి ఎలా వచ్చింది? అని చామల ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్య స్నేహితుడే ప్రదీప్ రెడ్డి అని తెలిపారు. ఈ ఫాంహౌస్ లో రెంట్ కు ఉంటున్నా అని కేటీఆర్ అంటున్నారు... కానీ.. ప్రదీప్ రెడ్డి, కేటీఆర్ కు మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదని ఎంపీ చామల వెల్లడించారు. గతంలో జన్వాడ ఫాంహౌస్ దగ్గర డ్రోన్ ఎగురవేస్తే రేవంత్ రెడ్డిపై కేసు పెట్టారని ఆయన గుర్తు చేశారు.
''ఫామ్ హౌస్ వద్దకు వస్తే కేసులు పెడతామని ప్రదీప్ రెడ్డి అన్నారు. సర్వే నెంబర్ 311, 301, 313లో అక్రమాలు జరిగితే నిగ్గు తేలుస్తాం. ఈ భూములన్నీ సత్యం రామలింగరాజువి. డీ అండ్ యు కంపెనీ పేరు మీద భూములు ట్రాన్స్ ఫర్ చేశారు. వేరే కంపెనీ నుంచి ఈ భూములను ప్రదీప్ రెడ్డి పేరు పై ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.
111 జీవోతో సత్యం రామలింగరాజు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సత్యం రామలింగరాజు కంపెనీ నుంచి ఈ భూములు రాజేశ్ కు బదిలీ అయ్యాయి. రాజేశ్ నుంచి ఈ భూములు ప్రదీప్ రెడ్డికి బదిలీ అయ్యాయి. హరీశ్ రావు ఏమో ఇరిగేషన్ భూముల్లో, కేటీఆర్ ఏమో 111 జీవో పరిధిలోని భూముల్లో ఫాంహౌస్ లు కట్టుకున్నారు. అధికార దుర్వినియోగం చేసి కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు'' అని ఎంపీ చామల ఆరోపించారు. కాగా, జన్వాడ ఫాంహౌస్ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు ఎంపీ చామల.












