తెలంగాణ

Eshwaramma: డబ్బులిస్తాం రాజీపడండి.. ఈశ్వరమ్మ యాదవ్ ఆడియో లీక్ !

రచన: Mahesh6 నిమిషాల పఠనం

Eshwaramma: రాజకీయ పలుకుబడి, అధికార మదం ఓ నిరుపేద యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వివాదంలో మొదలైన గొడవ.. ఓ నిండు ప్రాణం గాల్లో కలవడానికి కారణమైంది. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేశ్ యాదవ్ సాగించిన రాక్షస వేధింపులే గిరిజన యువకుడి బలవన్మరణానికి దారితీశాయన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

Eshwaramma: రాజకీయ పలుకుబడి, అధికార మదం ఓ నిరుపేద యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వివాదంలో మొదలైన గొడవ.. ఓ నిండు ప్రాణం గాల్లో కలవడానికి కారణమైంది. యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేశ్ యాదవ్ సాగించిన రాక్షస వేధింపులే గిరిజన యువకుడి బలవన్మరణానికి దారితీశాయన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, కేసును నీరుగార్చేందుకు బాధితులపై బెదిరింపులకు దిగుతుండటంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మూడు రోజుల నరకం.. చివరకు ఆత్మహత్య

ఓ బైక్ వ్యవహారంలో ఎరుకల సామాజికవర్గానికి చెందిన రాజేష్ అనే గిరిజన యువకుడితో సురేశ్ యాదవ్ పంచాయితీ పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా రాజేష్‌పై నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డాడు. గత మూడు రోజులుగా సురేశ్ యాదవ్ చేస్తున్న శారీరక దాడులు, తీవ్ర వేధింపులను తట్టుకోలేక, తీవ్ర మానసిక క్షోభకు గురైన రాజేష్ అర్ధరాత్రి వేళ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణమైన వారి వేధింపులను తట్టుకోలేకే అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పోలీస్ స్టేషన్‌లో హల్చల్..

రాజేష్ ఆత్మహత్య విషయం వెలుగులోకి రావడంతో ఈశ్వరమ్మ యాదవ్ కుటుంబం వెంటనే రంగంలోకి దిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఆమె మనవళ్లు స్వయంగా హల్‌చల్ చేసి వ్యవహారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని సమాచారం. మరోవైపు ఈశ్వరమ్మ యాదవ్ నేరుగా మృతుడి తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన తీరు పెను దుమారానికి దారితీసింది. "నా మనవడి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయవద్దు.. పోయిన ప్రాణం ఎలాగూ తిరిగిరాదు కదా, ఎంత డబ్బైనా ఇస్తాం.. రాజీకి రండి" అంటూ బెదిరింపు ధోరణిలో ఒత్తిడి తెచ్చినట్లు మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

నాడు సానుభూతి కోరి.. నేడు బెదిరింపులా..

కొద్ది నెలల క్రితం ఇదే ఈశ్వరమ్మ యాదవ్‌పై కాంగ్రెస్ నాయకుడు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె సీనియారిటీని, వయసును గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు ఆమెకు అండగా నిలిచారు. అప్పుడు తనకు జరిగిన అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఇప్పుడు తన స్వంత మనవడు ఓ పేదింటి గిరిజన బిడ్డను వేధించి ప్రాణాలు తీసే స్థాయికి వెళితే ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. తప్పు చేసిన మనవడిని పోలీసులకు అప్పగించి న్యాయం వైపు నిలబడాల్సిన బాధ్యత గల పదవిలో ఉన్న మహిళ.. ఇలా డబ్బు ఆశ చూపి కేసును తప్పుదోవ పట్టించాలని చూడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

భగ్గుమంటున్న ప్రజా, గిరిజన సంఘాలు

ఈ ఘోరానికి కారణమైన పోచబోయిన సురేశ్ యాదవ్‌తో పాటు కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్న ఈశ్వరమ్మ యాదవ్‌పై తక్షణమే ఎస్సీ, ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ప్రాణం పోయిన నిరుపేద కుటుంబానికి నష్టపరిహారంతో పాటు నిందితుడికి చట్టపరమైన శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నాయి.

#Eshwaramma Yadav#Eshwaramma Yadav Audio Leak#Eshwaramma Audio Leak#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి