తెలంగాణ

Erravalli: ఎర్రవల్లి భూముల సర్వేలో గందరగోళం.. వెంకటాపూర్ రైతుల ధర్నా!

రచన: Mahesh5 నిమిషాల పఠనం

Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు అత్యంత సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 325 పరిధిలోని భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా, పాలనాపరంగా హాట్ టాపిక్‌గా మారింది.

Erravalli: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు అత్యంత సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 325 పరిధిలోని భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా, పాలనాపరంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సర్వే నెంబర్‌లోని మొత్తం 388 ఎకరాల భూమి సరిహద్దులను తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగగా, సరిగ్గా సర్వే మొదలయ్యే సమయానికి ఊహించని రీతిలో పక్క గ్రామం రైతులు తెరపైకి వచ్చి పంచాయితీ పెట్టడం సంచలనంగా మారింది.

388 ఎకరాల్లో మాకూ హక్కుంది

ఎర్రవల్లి పరిధిలోని ఈ వివాదాస్పద సర్వే నెంబర్‌లో అధికారులు రీ-సర్వే చేపట్టడంపై శివారు వెంకటాపూర్ గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మొత్తం 388 ఎకరాల భూమి కేవలం ఎర్రవల్లి వాసులదే కాదని, అందులో ఎర్రవల్లి రైతులకు 250 ఎకరాలు మాత్రమే చెందుతుందని వారు కుండబద్దలు కొట్టారు. మిగిలిన భూమిపై వెంకటాపూర్ గ్రామ రైతులకు పూర్తి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితం రెవెన్యూ అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పిదాల వల్లే రికార్డులు తారుమారయ్యాయని, తప్పుడు ఎంట్రీలతో తమ హక్కులను కాలరాశారని మండిపడుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేను పాత కాస్రా, సిత్వార్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పూర్తి చేయాలని, లేనిపక్షంలో ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరిస్తున్నారు.

215 మంది రైతులకు నోటీసులు..

మరోవైపు వివాదాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారు. సర్వే నెంబర్ 325లో ప్రస్తుతం సాగు చేసుకుంటున్న సుమారు 215 మంది రైతులకు విడతల వారీగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతగా 50 మంది రైతులకు అధికారిక నోటీసులు అందజేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి నాలుగు విడతల్లో అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయి రీ-సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 21వ తేదీన రైతులంతా సంబంధిత ఆధారాలతో భూముల వద్ద ప్రత్యక్షంగా హాజరుకావాలని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఫాంహౌస్‌కు ఆనుకుని ఉన్న అత్యంత ఖరీదైన భూములు కావడం, దీనికి తోడు రెండు గ్రామాల రైతుల మధ్య వాటాల పంచాయితీ తెరపైకి రావడంతో అధికార యంత్రాంగానికి ఈ సర్వే పెద్ద తలనొప్పిగా మారింది. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సర్వే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

#Erravalli#Erravalli Land Issue#Erravalli Land Survey#Erravalli Survey No 325#Survey Number 325#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి