Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దానం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శనివారం మధ్యాహ్నం సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ కూడా చేయడంతో అనర్హతకు గురయ్యారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానంపై అనర్హత వేటు పడింది. సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే దానం నాగేందర్ అనర్హుడు అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లుగా పరిగణించాలని న్యాయస్థానం చెప్పింది.
కోర్టు తీర్పుపై స్పందించిన దానం నాగేందర్.. తనకు పోరాటం చేయడం కొత్త కాదని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన లేదని ప్రకటించిన దానం నాగేందర్.. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రకటించబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఇదే వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీలు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు దాఖలు చేశాయి. బీజేపీ తరపున ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్లు వేశారు. ఈ అంశంలో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని వారు కోరారు.








