నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్న వాతావరణ శాఖ.. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది..
గత కొన్ని రోజులుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అనుకూల వాతావరణ పరిస్థితులు, తేమగాలుల ప్రభావంతో తెలంగాణలో మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న ఉత్తర తెలంగాణ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాలు గంటల వ్యవధిలోనే జలమయమయ్యాయి.
ఇక అధికారుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది..
మరోవైపు హైదరాబాద్‌లో నేడు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, అత్యవసరంగా బయటికి వెళ్ళితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని పేర్కొంటున్నారు..
విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలనిహెచ్చరిస్తున్నారు. వాహనదారులు కూడా రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియచేస్తున్నారు..












