హైడ్రాను అడ్డం పెట్టుకుని సీఎం రేవంత్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని మల్కాజరిగి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.అంతేకాకుండా హైడ్రా మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉంటుందని, కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదని స్పష్టంచేశారు.
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను స్థాపించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడని, హిట్లర్ ఎంతో విధ్వంసం సృష్టించారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. ప్రజలపై అగఘాయిత్యాలకు పాల్పడ్డారని, నాడు హిట్లర్ ప్రజలను వేధించినట్టే.. నేడు హైడ్రా సాయంతో రేవంత్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారని, ఆస్తులు కాపాడే సంస్థగా దానిని ఎవరూ చూడటం లేదని మండిపడ్డారు.
చాలా ఏళ్ల కిందట తెలంగాణ నలుమూలల నుండి వచ్చి చెరువులు, కాలువల పక్కన కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఈ ప్రభుత్వం కూల్చివేసిందని, తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడని ఎంపీ ఈటల ఆరోపించారు. హైదరాబాద్ మహా నగరంలో హైడ్రాను చూసి భయపడి ఇల్లు కొనేందుకు సైతం ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా రెవెన్యూ, మున్సిపల్, హోండిపార్ట్‌మెంట్ ఇలా అన్నింటికంటే సుప్రీంగా హైడ్రా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.చివరకు కోర్టుల మాట కూడా వినడంలేదని, కనీసం రేవంత్ రెడ్డి మాట అయినా హైడ్రా వింటుందో లేదో అనే అనుమానం కలుగుతోందని ఎంపీ వ్యాఖ్యానించారు.












