పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ సీరియస్‌గా దృష్టిసారించింది. 2027వరకు ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రాంతాలు పోలవరం కింద ముంపునకు గురయ్యే చాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం కింద రాష్ట్రాల్లోని ఎన్ని మండలాలు ముంపునకు గురవుతున్నాయో ముందుగానే సర్వే చేయించి ఆ నివేదికలు కేంద్రానికి పంపించి భూములు, ఇండ్లు కోల్పోయే వారికి పరిహారం ఇప్పించాలని భావిస్తోంది.
అందుకోసం మరోసారి సర్వే చేపట్టాలని రేవంత్ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఐఐటీ హైదరాబాద్‌కు సర్వే బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు తెలిసింది. గతంలోనే ఐఐటీ హైదరాబాద్‌కు ముంపు అంచనా సర్వే బాధ్యతలు అప్పగించినా.. ఆ పనులు ముందుకు సాగలేదు.ఎందుకంటే వివిధ రకాల అంశాలు దీనిపై ముడిపడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలను వివరించి వెంటనే సర్వే పనులు ప్రారంభించేలా చూడాలని చెప్పనున్నట్టు సమాచారం.
రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాల్లోని ఏడు మండలాలను కేంద్రం ఏపీకి కేటాయించింది. ఈ మండలాలు ముంపునకు గురవనున్నాయి. అవి కాకుండా తెలంగాణలోని పలు గ్రామాలు, భూములు ముంపునకు గురవుతాయని తెలుస్తోంది. దీనిపై గతంలో ఇరురాష్ట్రాలు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే నిర్వహించగా.. 900 ఎకరాల వరకు భూమి ముంపునకు గురవుతుందని తేలింది. దానిని ఇప్పుడు పక్కనబెట్టి మరోసారి ఐఐటీ హైదరాబాద్ ద్వారా సర్వేను నిర్వహించి ఆ రిపోర్టను కేంద్రానికి పంపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
ముందుగా నష్టపరిహారం చెల్లించాకే పోలవరం నిర్మాణం చేయాలని, లేదంటే ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతారని కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టాలని సర్కార్ చూస్తున్నది. అయితే, భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం పోలవరం ముంపునకు గురవనుందా? అనేది సర్వే తర్వాత తేలనుంది. కాగా, 160 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం నిర్మాణాన్ని ఏపీ, కేంద్రం సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.












