నీట్ పేపర్ లీక్.. అందుకు వ్యతిరేకంగా చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల విజయంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఊపుమీదుంది. ఇదే ఉత్సాహంతో సరికొత్త రాజకీయ వ్యూహాలకు సద్ధమవుతోంది. తమ పోరాటానికి లభించిన ఆదరణను కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా యువతతో నేరుగా మమేకమయ్యేందుకు 'లిజనింగ్ టూర్' పేరిట ప్రత్యేక పర్యటన చేపడుతున్నట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు.
భారతదేశంలోని యువత ఆశయాలు, వారి సమస్యలు, ప్రధాన ఆందోళనలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ దేశవ్యాప్త పర్యటన ముఖ్య ఉద్దేశమని పార్టీ ప్రకటించింది. తమ భవిష్యత్ రాజకీయ, సంస్థాగత కార్యాచరణను ఖరారు చేసేందుకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీజేపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.
పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో జరగనున్న ఈ భేటీకి ముఖ్య అధికార ప్రతినిధులు, వివిధ జిల్లాల సంస్థాగత నాయకులు హాజరుకానున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన భారీ నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న 50మంది వాలంటీర్లు, ఇతర భాగస్వాములతో క్షేత్రస్థాయిలో చర్చించిన తర్వాతే ఈ సమావేశం నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తాము చేపట్టిన కఠోర పోరాట ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, రెండు నెలలుగా కొనసాగుతున్న ఉద్యమానికి ఇది విప్లవాత్మక విజయమని సీజేపీ నాయకులు పేర్కొన్నారు. యువత అంతా ఒక్కటై అహంకారపూరిత నిర్ణయాలను ప్రశ్నిస్తే విజయం ఖాయమని ఈ ఉద్యమం నిరూపించిందని సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అభిప్రాయపడ్డారు.
త్వరలోనే ఈ దేశవ్యాప్త 'లిజనింగ్ టూర్'కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ప్రణాళిక, పర్యటన రూపురేఖలను అధికారికంగా వెల్లడిస్తామని పార్టీ తెలిపింది. నీట్ వ్యతిరేక ఉద్యమం ద్వారా వచ్చిన సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకుంటూ, తమ సంస్థాగత బలాన్ని విస్తరించుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని సీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.












