అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.. తాజాగా ట్రంప్ నిర్ణయం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఇటీవల భారత్‌తో సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ కొత్తగా పన్నులు విధించారు.
ఈ క్రమంలో అమెరికా దిగుమతుల్లో 99.4 శాతం వాటా ఉన్న 60 దేశాలపై కొత్తగా విధించిన సుంకాలను సవాల్ చేస్తూ 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి కోర్టును ఆశ్రయించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని, వీటివల్ల దేశవ్యాప్తంగా వినియోగదారులు, వ్యాపారాలపై తీవ్ర భారం పడుతుందని తెలియచేస్తూ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో దావా వేసింది.
ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని మండిపడింది. ఇంతకుముందు కూడా ట్రంప్ విధించిన అనేక సుంకాల నిర్ణయాలు అమెరికా కోర్టులలో చిక్కులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్‌లపై నమోదైన కేసు ట్రంప్ వాణిజ్య విధానాలకు పరీక్షగా నిలిచింది. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం 60 దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు గత నెలలో కొత్త సుంకాలను విధించింది.
బలవంతపు కార్మిక వ్యవస్థను అరికట్టడంలో దేశాలు విఫలమయ్యాయన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తనను తాను సమర్థించుకుంది. అయితే భారత్‌పై తొలుత 12.5 శాతం సుంకం ప్రతిపాదించినప్పటికీ, తర్వాత దానిని 10 శాతానికి తగ్గించారు. ఫలితంగా మరో 16 దేశాలతో పాటు భారత్ ఈ 10 శాతం టారిఫ్ పరిధిలోకి వస్తుంది. ఇందులో చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు..
అయితే బలవంతపు కార్మిక వ్యవస్థను ఎదుర్కోవడానికి ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ను ఉపయోగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇది కేవలం పన్నులు విధించడానికేనని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న వరుస సుంకాల నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇది మతి తప్పి తీసుకున్న నిర్ణయమా? లేక అమెరికా ప్రయోజనాల కోసం ప్రపంచ వాణిజ్య సమీకరణాలను మార్చే వ్యూహమా?..
అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దిగుమతులపై భారీ టారిఫ్‌లు విధించడం వల్ల అనేక దేశాల ఎగుమతులు దెబ్బతింటున్నాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణం ఒత్తిడి కూడా పెరిగే ప్రమాదం ఉంది. మిత్రదేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవైపు అమెరికా పరిశ్రమలను కాపాడాలనే ప్రయత్నం కనిపిస్తుండగా, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతోంది. ట్రంప్ నిర్ణయాలు చివరికి అమెరికాకు లాభమా? లేక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి నాంది పలుకుతాయా? అనే ప్రశ్నకు రానున్న రోజులు సమాధానం చెప్పనున్నాయి.












